Asianet News TeluguAsianet News Telugu

పెద్ద మనసు చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు అలివేలు

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ పారిశుధ్ధ్య కార్మికురాలు పెద్ద మనసు చేసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సొమ్మును విరాళంగా ఇచ్చింది. ఆమె చేతుల మీదుగా చెక్కును కేటీఆర్ అందుకున్నారు.

Health worker donates amount to CM relief fund, KTR recieves
Author
Hyderabad, First Published Apr 28, 2020, 5:27 PM IST

మానవాళి గతంలో ఎన్నడూ ఎరుగని కరోనా వైరస్ అనేకమంది మనసుని కదిలిస్తుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కష్టకాలంలో అనేక మంది తమకు తోచిన విధంగా పరులకు ఉపకారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలానే ఈరోజు హైదరాబాద్ కు చెందిన అలివేలు తన పెద్ద మనసును చాటుకుంది. జియగుడా కు చెందిన అలివేలు,  గత ఐదు సంవత్సరాలుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తోంది. ఈ రోజు అలివేలు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆమె ఈరోజు 12000 తన నెల జీతం లోంచి పదివేల రూపాయలు తీసి మంత్రి కే. తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

ఈ సందర్భంగా అలివేలు మంచి మనసుని అభినందించిన మంత్రి కేటీఆర్ ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇంత తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక నెల జీతాన్ని కరొనా పోరు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అలివేలుని మంత్రి అభినందించారు. ఆమె పిల్లలు భర్త ఏం చేస్తారంటుటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్ లో రోజువారి కూలీగా పని చేస్తారని, తన పిల్లలు చదువుకుంటున్నారని అలివేలు ఈ సందర్భంగా తెలిపింది.

నీ కుటుంబానికి ఎప్పుడైనా తాను అండగా ఉంటానని, ఏదైనా సహాయం కావాలంటే చెప్పాలని మంత్రి కేటీఆర్ అనగా, తాను ఎలాంటి లాభాపేక్ష కానీ ప్రయోజనం కానీ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని కేవలం ఇతరులకు ఈ కష్టకాలంలో ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఇస్తున్నానని మంత్రికి సమాధానం ఇచ్చింది. తాను నెల రోజుల వేతనాన్ని మొత్తం ఇస్తానని చెప్పగా అనేకమంది ఈ కష్టకాలంలో ఎందుకు ఇవ్వడం మీతో ఉంచుకోమని సూచించారని అయితే తన భర్త శ్రీశైలం, తన పిల్లలు శివ ప్రసాద్, వందనలు తన ఆలోచన కి అండగా నిలిచారని తెలిపింది.

 రెండో ఆలోచన లేకుండా తనకు తోచిన మేర సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన అలివేలు మంచి మనసు పట్ల మంత్రి అభినందనలు వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు గా ఒకవైపు కరొనా పోరులో ముందు వరుసలో ఉన్న అలివేలు, విరాళం సైతం ఇచ్చేందుకు ముందుకు రావడం ఆమె కాకుండా మొత్తం కరొనా పోరులో ముందువరుసలో నిలిచిన ప్రతి ఒక్కరికి మరింత గౌరవాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios