పవన్ కళ్యాణ్ పై మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ పై మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన వస్తే ఆ రోజు భోజనం చేయలేదని చెప్పారని మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో గుర్తు చేశారు.
హైదరాబాద్: ఆరోగ్య మంత్రి హరీశ్ రావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన ప్రకటించిన రోజు భోజనం మానేశానని పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు శుక్రవారం మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే తెలంగాణ బీజేపీ ఆయన వద్దకు వెళ్లి పొత్తు కోసం చర్చించిన విషయమూ విధితమే. ఈ పొత్తులపై ఢిల్లీలోనూ బీజేపీ జాతీయ నేతలతో భేటీ జరిగింది. అయితే.. సీట్ల విషయమై క్లారిటీ రాలేదు.
జనసేన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్నది. అక్కడే ప్రధాన లక్ష్యం ఉన్నది. తెలంగాణలో ఏపీ సెట్లర్లను ఆకట్టుకోవాలని, అలాగే.. అభిమానుల బలమూ జనసేనకు ఉన్నది. పవన్ కళ్యాణ్‌తోపాటు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం పైనా చర్చలు జరిగాయి. అయితే.. షర్మిలాను ఏపీలోనే వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Also Read: గజ్వేల్‌పై సీఎం ఫోకస్.. ఈటల రాజేందర్ టార్గెట్‌గా స్ట్రాటజీ
తాజాగా, అసెంబ్లీ బరి నుంచి షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ విషయాలను మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్, షర్మిలా ఇద్దరూ తెలంగాణ ద్రోహులని, అలాంటి ద్రోహులతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పాకులాడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ద్రోహుల మద్దతు కోరుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, టీడీపీ కూడా లోలోపల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని తనకు తెలిసినట్టు హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంలో తెలంగాణ తెచ్చిన పార్టీ వైపు నిలబడతారా? తెలంగాణ ద్రోహుల వైపు నిలబడతారా? అని ప్రశ్నించారు. స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. ఇతర లీడర్లు ఎందుకు, రిస్క్ ఎందుకు? అని హరీశ్ రావు అన్నారు.