త్వరలో ఎయిర్ అంబులెన్స్ సేవలు .. మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన
Air Ambulance Services: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. అత్యవసర సమయంలో మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

Air Ambulance Services: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నది.అత్యవసర సమయంలో మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా, స్పెషాలిటీ ఆసుపత్రులకు రోగులను త్వరగా చేర్చుకునేందుకు వీలుగా రానున్ను రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలను కాపాడేందుకు వీలుగా త్వరలో ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించబోతున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
రాష్ట్రంలో ఏ మూరుమూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా రోగులను ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న రోగులు, కుటుంబాలను ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకోనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను సోమవారం విడుదల చేసిన హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతోనే దశాబ్ద కాలంలోనే తెలంగాణ జాతీయ వైద్యరంగంలో రోల్‌మోడల్‌గా నిలిచిందని, ఈ కాలంలో ఊహించలేని మార్పులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖకు అపూర్వమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు ఎయిర్ అంబులెన్స్ సౌకర్యం వంటి ప్రత్యేక కార్యక్రమాలను రానున్న రోజుల్లో ప్రవేశపెడుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాగే.. రాబోయే కొన్ని వారాల్లో గాంధీ ఆస్పత్రిలో కేంద్రీకృత అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని హరీశ్‌రావు తెలిపారు.
గడచిన తొమ్మిదేళ్లలో వైద్య శాఖలో దాదాపు 22,600 పోస్టులు భర్తీ చేశామనీ, అదనంగా మరో 7,291 పోస్టులను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని,ఓవరాల్‌గా వచ్చే నెలల్లో వైద్య శాఖలో దాదాపు 30,000 ఉద్యోగాల భర్తీని పూర్తి చేయగలుగుతామని ఆయన చెప్పారు.
ఫార్మసిస్టులకు నియామక పత్రాలు
మొత్తం 310 మంది ఫార్మసిస్ట్‌లు సోమవారం రాష్ట్ర ఆరోగ్య శాఖలో చేరారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్య మంత్రి నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 310 మంది వ్యక్తులు వివిధ హోదాల్లో సేవలందించే ఫార్మసిస్ట్‌లుగా నియమితులయ్యారు. 105 మంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (DPH), 135 మంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కింద, మిగిలిన 70 మంది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కింద బాధ్యతలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులను మంత్రి హరీశ్ రావు అభినందిస్తూ.. రోగులకు ఔషధాల లభ్యత, సరైన నిర్వహణ, తద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను పెంపొందించడంలో ఫార్మసిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తారని మంత్రి హరీష్ రావు హైలైట్ చేశారు.
గత 10 ఏండ్లలో వైద్యరంగం సాధించిన విజయాలు
• ఆరోగ్య శాఖ వార్షిక బడ్జెట్: 2014లో 925 కోట్లు ఉండగా.. 2023లో 3532 కోట్లు
• ప్రభుత్వ ఆసుపత్రి పడకలు: 2014లో 17,000 ఉండగా..2023లో 34,000
• ప్రభుత్వ వైద్య కళాశాలలు: 2014లో 5 వైద్య కళాశాలలు ఉండగా, 2023లో 26 వైద్య కళాశాలు
• ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు: 2014లో 5 ఉండగా.. 2023 లో వాటి సంఖ్య 26 కి చేరింది.ః
• MBBS వైద్య సీట్లు: 2014లో 2885 సీట్లు మాత్రమే ఉండగా.. నేడు(2023) ఆ సంఖ్య 8,515 చేరింది.
• పీజీ మెడికల్ సీట్లు: 2014లో 1183 ఉండగా.. 2023 లో 2890
• ప్రభుత్వ MBBS సీట్లు : 2014లో 850 ఉండగా.. 2023లో ఆ సంఖ్య 3,690 కి చేరింది.
• ప్రభుత్వ PG మెడికల్ సీట్లు: 2014 లో 515 కాగా.. 2023లో 1,320
• డయాలసిస్ సౌకర్యాలు: 2014 లో కేవలం మూడు.. నేడు (2023) వాటి సంఖ్య 82కు చేరింది.
• ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు: 2014 లో 30 శాతం కాగా.. 2023లో 70 శాతం
• 108 అంబులెన్స్‌లు : 2014 లో 316 కాగా.. 2023 లో 455
• నియోనాటల్ అంబులెన్స్‌లు: 2014 లో ఇవి అందుబాటులో లేవు. 2023 లో 33 ఉన్నాయి.
• అమ్మఒడి అంబులెన్స్‌లు : 2014 లో ఇవి అందుబాటులో లేవు. ప్రస్తుతం 300 అంబులెన్స్ లు.