కూతురు వయసున్న విద్యార్థినితో ఓ హెడ్ మాస్టర్ నీచంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వికారాబాద్ : విద్యాబుద్దులు నేర్పించే గురువే బుద్దితక్కువ పని చేసాడు. చదువుచెప్పే చిన్నారులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వాడి కళ్లు కామంతో మూసుకుపోయాయి. అభం శుభం తెలియని చిన్నారిపై కీచక ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదులో సదరు ప్రధానోపాధ్యాయున్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రభు ప్రధానోపాధ్యాయుడికి పనిచేస్తున్నాడు. అయితే విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు తప్పుచేస్తే మందలించాల్సిన ఉన్నత స్థానంలో వున్నవాడే తప్పుడు పని చేసాడు. ఓ విద్యార్థినిపై కన్నేసిన ఈ నీచుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని అనవసరంగా తాకడం, వెకిలిగా మాట్లాడటం చేసేవాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాలిక స్కూల్ కు వెళ్లడం మానేసింది.
రెండ్రోజులుగా స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే వుంటున్న కూతుర్ని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో బోరున విలపిస్తూ తనతో ప్రధానోపాధ్యాయుడు ప్రభు ప్రవర్తిస్తున్న తీరు గురించి వివరించింది. దీంతో వారు కుటుంబసభ్యులు, స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్ళి ప్రధానోపాధ్యాయున్ని నిలదీసారు. తనకేమీ తెలియదంటూ బుకాయించడానికి ప్రయత్నించాడు ప్రభు. అయినప్పటికి అతడిని వదిలిపెట్టని తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు.
Read More మైనర్ బాలికపై బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సోదరుడు అత్యాచారం..
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హెడ్ మాస్టర్ ప్రభును అదుపులోకి తీసుకున్న పోలీసులు మోమిన్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ బిడ్డపై ప్రధానోపాధ్యుడు లైంగిక వేధింపుల పాల్పడ్డాడని... అతడిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డిఈవో రేణుకా దేవికి కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. దీంతో డిఈవో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ ఘనీని ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. అతడు విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు.
