Asianet News TeluguAsianet News Telugu

సైకో, సతాయిస్తాడు.. సూసైడ్ లెటర్ రాసి హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య..

భర్త అనుమానంతో వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక ఓ పోలీసు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. 

Head constable wife commits suicide In mancherial
Author
First Published Nov 29, 2022, 7:23 AM IST

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జున కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, పిల్లల పేరు మీద సూసైడ్ లెటర్ రాసిపెట్టి, తనను క్షమించమని కోరుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై 15 సంవత్సరాలు గడుస్తున్నా భర్త ప్రేమకు నోచుకోక.. దీనికి బదులు తరచూ అనుమానాలు, వేదింపులు తాళలేక తాను చనిపోతున్నానని తెలిపింది. భర్త వేధింపులు భరించలేకపోతున్నానని, అమ్మానాన్నలకు తాను భారం కాకూడదనుకున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంది. 

ఈ ఘటన మీద పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు, మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన వనిత (35)తో వివాహమైంది. ఈ వివాహం జరిగి 15 సంవత్సరాలు  అవుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అందరికీ న్యాయం చేయాల్సిన పోలీసు వృత్తిలో భర్త కిష్టయ్య ఉండడమే. అతను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

నాగార్జున కాలనీ సింగరేణి క్వార్టర్స్ లో కుటుంబంతో కలిసి కిష్టయ్య  అద్దెకుంటున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ కిష్టయ్యకు భార్య వనిత మీద అనుమానం ఏర్పడింది. ఈ అనుమానంతోనే నిత్యం వనితను తీవ్రంగా వేధిస్తుండేవాడు. అవి రోజురోజుకూ మితిమీరుతుండడంతో ఆమె భరించలేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడింది. ప్రతీరోజూ లాగే మధ్యాహ్నం భర్త ఇంటికి వచ్చాడు. వనిత ఉరివేసుకుని కనిపించింది. షాక్ అయ్యాడు. వెంటనే ఏం చేయాలో పాలు పోలేదు. తన పోలీస్ బుద్దిని ఉపయోగించాడు. ఇరుగుపొరుగు భార్య ఉరేసుకుందని చెప్పి.. వారు వచ్చిన హడావుడిలో మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యాడు.

పెళ్లి కొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదని ఆగిపోయిన పెళ్లి.. !

సమాచారం తెలియడంతో వనిత తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న కుమార్తె ను చూసి గుండెలు బాదుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ రవి కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

భర్త తనను ఎలా మానసిక క్షోభకు గురి చేశాడో వనిత తన లేఖలో.. తల్లిదండ్రులు, పిల్లలకు చెప్పుకొచ్చింది. ఆ లెటర్ చదివిన వారందరినీ  కంటతడి పెట్టేలా చేస్తోంది. ఆ లేఖలో ఆమె ‘నా భర్త కిష్టయ్య పెద్ద సైకో…నన్ను ఈ 15 యేళ్లలో ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఇంట్లో నుంచి కాలు బైటికి పెడితే అనుమానించేవాడు. రోజురోజుకూ అతని వేధింపులు ఎక్కువవుతున్నాయి. దీంతో నేను చాలా మానసిక క్షోభకు గురయ్యాను.. బతకడం వృధా అనిపిస్తోంది.. అందుకే చనిపోతున్నా..’ అని రాసుకొచ్చింది. తల్లిదండ్రులను ఉద్దేశించి... తన పిల్లలను సైకో భర్తకు అప్పగించ వద్దని, జాగ్రత్తగా మీరే చూసుకోవాలని కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios