తన ఇంటిముందునుంచి వెడుతున్నవారిని చితకబాదడమే కాకుండా.. అడిగనందుకు వ్యక్తిని కారు బానెట్ మీద ఎక్కించుకుని 100మీటర్ల వరకు ఈడ్చుకెళాడు. చంపుతానంటూ బెదిరించాడు.
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తన ఇంటి ముందు నుంచి వెళుతున్నాడని ఓ యువకుడిని చితకబాదాడు. అకారణంగా ఎందుకు కొట్టావు అని అడగడానికి వెళ్లిన ఇద్దరు మహిళల మీద కూడా దాడి చేశాడు. ఇది అక్రమం అంటూ హెడ్ కానిస్టేబుల్ ను ప్రశ్నించిన మరో వ్యక్తి మీదికి కారును తోలించి.. కొద్ది దూరం అలాగే లాక్కెళ్లి, ఢీ కొట్టి బెదిరించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ మీద కేసు నమోదు అయ్యింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ ఈ మేరకు తెలిపారు. ముచ్చింతల్ కు చెందిన ధార కృష్ణ- బాలమణి దంపతులు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినవాడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తాను పోలీస్ అన్న అహంతో.. గత కొంతకాలంగా తన ఇంటి ముందు నుంచి వెళుతున్న వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఘర్షణకు దిగుతున్నాడు.
అత్తవారింట్లో ఘోర అవమానం... మనస్థాపంతో యువకుడు సెల్పీ సూసైడ్
అలా ధార కృష్ణ కుమారుడు పవన్ కుమార్.. ఓ రోజు హెడ్ కానిస్టేబుల్ ఇంటి ముందు నుంచి తన పొలానికి వెళుతున్నాడు. అది చూసిన హెడ్ కానిస్టేబుల్, అతని కొడుకు వంశీ.. పవన్ కుమార్ తో అనవసరంగా గొడవకు దిగారు. అతని మీద చేయి చేసుకుని చితకబాదారు. దీంతో పవన్ స్పృహ కోల్పోయాడు. విషయం పవన్ కుమార్ తల్లిదండ్రులకు తెలియడంతో…పవన్ తల్లి బాలమణి, అతని సోదరి రూపలు హెడ్ కానిస్టేబుల్ ను ప్రశ్నించడానికి వచ్చారు.
హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ వారిద్దరినీ చూసి.. తనని నిలదీస్తారా అంటూ తీవ్ర కోపానికి లోనయ్యాడు. అంతేకాదు మహిళలు అని కూడా చూడకుండా బాలమణి, రూపల మీద చేయి చేసుకున్నాడు. వారు వెంటనే వెళ్లి విషయాన్ని బంధువులకు చెప్పగా.. వారి బంధువైన రాజుతో పాటు ఇంకొంతమంది గ్రామస్తులు జ్ఞానేశ్వర్ ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో మరింత అగ్రహావేశానికి లోనైనా జ్ఞానేశ్వర్ తన కారు తీసి.. వేగంగా వారిని దాంతో ఢీకొట్టాడానికి ప్రయత్నించాడు.
కారు కింద పడకుండా తప్పించుకునే ప్రయత్నంలో రాజు కారు బానేట్ మీద పడిపోయాడు. జ్ఞానేశ్వర్.. బ్యానెట్ మీద పడిన రాజును అలాగే 100 మీటర్ల దూరం వరకు లాకెళ్ళాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత గ్రామస్తులు… జ్ఞానేశ్వర్ దాడిలో గాయపడిన బాలమణి, రూప, పవన్, రాజులను ఆసుపత్రికి తరలించారు. జ్ఞానేశ్వర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.
