భార్య పుట్టింటికి రాకపోవడం, అత్తింటివారు అవమానించడంతో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మహబూబాబాద్ : పుట్టింటికి వెళ్ళిన భార్య కాపురానికి రాకపోవడంతో అతడు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. భార్యకు నచ్చజెప్పి తీసుకురావడానికి అత్తవారింటికి వెళితే అల్లుడన్న కనీస గౌరవం లేకుండా దారుణంగా ప్రవర్తించారు. కన్న కొడుకును కూడా చూడనివ్వకుండా ఇంటిబయటే నిలబెట్టి దూషించారు. దీంతో భార్యపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేసముద్రం మండలం ధర్మారంతండా శివారులోని వెంక్యాతండాకు చెందిన భానోతు అశోక్ కు ముత్యాలమ్మ తండాకు చెందిన బేబితో గతేడాది పెళ్లయ్యింది. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక పెళ్లయిన కొన్నాళ్లకే గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బేబి గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల క్రితమే బేబి ప్రసవం జరిగి పండంటి మగబిడ్డ జన్మించాడు.
అత్తింటివారు భార్యాబిడ్డను తన ఇంటికి పంపిస్తారని అశోక్ ఎదురుచూసాడు. కానీ నాలుగునెలలు గడుస్తున్నా వాళ్లు పంపకపోవడంతో అతడే అత్తవారింటికి వెళ్లి బిడ్డను తీసుకుని ఇంటికి రావాల్సిందిగా భార్యను కోరాడు. కానీ గతంలో జరిగిన కలహాలను మనసులో పెట్టుకున్న బేబి భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు.అంతేకాదు ఇంటికి వచ్చిన అల్లుడిని వాకిట్లోనే నిలబెట్టి అత్తామామలు సత్రి, ఆనంద్ ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అలాగే భార్య సోదరి రజిత, తోడల్లుడు నరేష్ కూడా అశోక్ ను దూషించారు.
Read More వాచ్ మెన్ హత్య కేసులో భార్య అరెస్ట్...
భార్యబిడ్డ తనతో రాకపోవడంతో పాటు అత్తింటివారు చేసిన అవమానాన్ని అశోక్ భరించలేకపోయాడు. దీంతో తనకు భార్యపై వున్న ప్రేమను తెలియజేస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 'నాకు నీపై చాలా ప్రేముంది... నీకు కూడా నాపై ప్రేముంటే ఈ వీడియో చూసి చచ్చేముందయినా ఇంటికి తిరిగిరా' అంటూ సెల్పీ వీడియో రికార్డ్ చేసుకుంటూనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అశోక్ సూసైడ్ వీడియోను చూసినవారు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంలో వెంటనే వారు దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో అశోక్ ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
తన కొడుకు అశోక్ ఆత్మహత్యకు అతడి అత్తింటివారే కారణమంటూ మృతుడి తండ్రి రాములు పోలీసులకు పిర్యాదు చేసాడు. దీంతో అత్తామామలతో పాటు భార్య సోదరి, తోడల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
