హైదరాబాద్‌ : కార్లు, బైక్‌లు అద్దెకు తీసుకుని వాటిని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌ పోలీసులతో కలిసి శంషాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం ఆటోమొబైల్‌ దొంగను శుక్రవారం అరెస్టు చేసింది. నిందితుడిని జి.మహేశ్‌ నూతన్‌ కుమార్‌(27)గా గుర్తించారు. 
మహేష్ మొబైల్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ నివాసి. స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి. మహేశ్‌ 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడి వద్ద నుండి పోలీసులు రూ. 70 లక్షల విలువ గల ఆరు కార్లు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

సైబరాబాద్‌ సీపీ వీ.సీ.సజ్జనార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్‌ గ్రాడ్యూయేట్‌ అయిన మహేశ్‌ ఎంపిక చేసుకున్న నగరాల్లో మెన్స్‌ హాస్టల్స్‌లో దిగుతాడు. అక్కడ తను రూం షేర్‌ చేసుకున్నవారికి నమ్మకం వచ్చేంత వరకు ఓపికగా ఉండి ఆపై వారి నగదు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఐడీ ఫ్రూప్స్‌తో పరారయ్యేవాడు. అనంతరం వాటిని ఉపయోగించి వివిధ కంపెనీల్లో కార్లు అద్దెకు తీసుకునేవాడు. 

జీపీఎస్‌ డివైజ్‌, ఒరిజినల్‌ నంబరు ప్లేట్‌ను తీసేసి వాటిని తక్కువ ధరకు అమ్మేవాడు. రెంటల్‌ కార్‌ ఏజెన్సీ ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్‌ క్లూస్‌ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.