Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ మంత్రులకు రేవంత్ కాక పుట్టిస్తున్నట్లేనా?

  • గులాబీ కూలి పనుల కేసును స్వీకరించిన హైకోర్టు
  • 13వ తేదీలోగా  వివరాలు ఇవ్వాలని ఎసిబికి ఆదేశం
HC admits petition on TRS  Gulabi coolie

టిఆర్ఎస్ పార్టీ జరిపిన ప్లీనరీ సభకు గులాబీ నేతలంతా కూలీ  పని చేసి డబ్బు సంపాదించారు. అయితే ఆ కూలి పనులు ఆశ్చర్యకరంగా సాగిన విషయం అందరికీ తెలిసిందే. గంట పనిచేసినా పది నిమిషాలు పని చేసినా లక్షలకు లక్షల రూపాయల కూలీ సంపాదించారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు. పార్టీ నేతలంతా క్షణాల్లో కూలీ చేసి లక్షలు సంపాదించారు.

అయితే గింతంత పనికి ఇంత పెద్ద మొత్తంలో కూలీ సంపాదించడం ఎలా సాధ్యమని అప్పట్లోనే ఈ వ్యవహారంపై రేవంత్ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఎసిబికి ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. కానీ ఎసిబి పట్టించుకోలేదు. కేసు నమోదు కూడా చేయలేదు.

దీంతో ఇటీవల రేవంత్ హైకోర్టుకు ఈ అంశాన్ని తీసుకుపోయారు. నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గులాబీ కూలీ పై తక్షణమే విచారణ జరిపేలా ఏసిబిని ఆదేశించాలంటూ కోరారు. ఇవాళ హైకోర్టు ఈ కేసును స్వీకరించింది. రేవంత్ తరుపున హైకోర్టులో సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు.

రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చ‌ర్య‌లు తీసుకున్నారో ఈనెల 13న కోర్టుకు నివేదించాల‌ని  ఏసీబీ అధికారుల‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఎసిబి ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి కేసు నడిచే అవకాశాలున్నాయి.

అయితే కచ్చితంగా ఈ కేసులో టిఆర్ఎస్ మంత్రులు దోషులుగా తేలే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. గతంనుంచీ ఆయన పలుమార్లు ఈ విషయాన్న వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రజా జీవితంలో ఉండి రాజ్యంగబద్ధమైన హోదాలో, పదవుల్లో ఉండేవారు చిన్నచిన్న పనులు చేసి లక్షలు సంపాదించడం అవినీతి అవుతుందన్న వాదనను రేవంత్ బలంగా ముందుకు తెస్తున్నారు.

గతంలో తన ఫోన్ ట్యాప్ చేస్తున్న కారణంగా గులాబీ కూలి పని చేస్తానని ప్రకటించిన సిఎం కేసిఆర్ తర్వాత తాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన సమాచారం తీసుకుని ఆయన గులాబీ కూలీ పని చేయకుండా వెనుకంజ వేశారని రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మొత్తానికి ఈ కేసు కొత్త చర్చను లేవనెత్తే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios