హైదరాబాద్: తన ఇంట్లో స్నానం చేస్తున్న మహిళను తన మొబైల్ ద్వారా చిత్రీకరిస్తూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆ విద్యార్థిని గంగాపురి వెంకటేష్ గా గుర్తించారు. పొరుగింటి మహిళ స్నానం చేస్తున్న సమయం చూసి తన మొబైల్ లో చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. 

ఆ సంఘటన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో  శుక్రవారం చోటు చేసుకుంది. వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మునగనూరుకు చెందిన 30 ఏళ్ల బాధితురాలు తన ఇంట్లో స్నానం చేస్తున్న సమయంలో తన ఇంటి పక్కన గోడపై ఓ వ్యక్తి ఉండడాన్ని గమనించింది.

అతను మొబైల్ ద్వారా తనను ఫిల్మ్ తీయడానికి ప్రయత్నించినట్లు గుర్తించింది. దీంతో కేకలు వేసింది. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

అతను మునగనూరులోని ద్వారకా నగర్ కు చెందినవాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.