Asianet News TeluguAsianet News Telugu

రైతు నాగలితో ఆకు పచ్చని చరిత్ర లిఖించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్: మంత్రి హరీశ్ 

Harishrao: కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని మంత్రి హరీశ్‌ నమ్మకం వ్యక్తంచేశారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన  బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి ప్లినరీలో మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

Harish Rao Says Telangana Developed In All Sectors Under Cm Kcr Rule KRJ
Author
First Published Apr 25, 2023, 6:07 PM IST

Harishrao: కొందరు చరిత్రను సిరాతో రాస్తారు, మరికొందరు చరిత్రను రక్తముతో రాస్తారు. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఇనుప బూట్లతో రాసాడు. కానీ, సీఎం కేసీఆర్ రైతు నాగలిని బట్టి కాళేశ్వరం సిరాతో ఆకు పచ్చని చరిత్రను లిఖించారని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఒక విజయం సాధిస్తే విక్టరీ అయితే.. రానే రాదు.. కానే కాదు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే హిస్టరీ అవుతోందని మంత్రి హరీష్ అన్నారు. గడ్డిపోచలా పదవులను త్యాగం చేసి  సీఎం కేసీఆర్ చరిత్రను తిరగరాసారని అన్నారు. 

సీఎం కేసీఆర్ కు చరిత్రలు సృష్టించడం కొత్తేమి కాదని, తెలంగాణ ఉద్యమం కోసం పార్టీని స్థాపించి, మంత్రి పదవికి, పలుమార్లు ఎమ్మెల్యేగా, పార్టీ పదవులకు రాజీనామా చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మంత్రి అన్నారు. తెలంగాణ కోసం 11 రోజుల అమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించడం ఓ హిస్టరీ, ఢిల్లీని కదిలించి తెలంగాణ ప్రకటన తీసుకరావడం ఓ హిస్టరీ.. వరుసగా రెండు సార్లు అత్యధిక మెజార్టీతో సీఎం కావడం ఓ హిస్టరీ.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి మరో చరిత్రకు నాంది పలికారనీ,  మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆరేనని అన్నారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన  బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి ప్లినరీలో మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని మంత్రి హరీశ్‌ నమ్మకం వ్యక్తంచేశారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. 

నేడు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే.. దానికి ముఖ్య కారణం సీఎం కేసీఆరేనని, ఆ పడిన శ్రమ ఈ బంగారు తెలంగాణ అని అన్నారు. ఉద్యమ జ్వాల కేసీఆర్‌ నేడు అభివృద్ధి జ్వాలగా మారరని మంత్రి అభివర్ణించారు. దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్నది తెలంగాణలోనేనని , యాసంగిలోనే 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదని వెల్లడించారు.

సమైక్య రాష్ట్రంలో మూగ జీవాలకు  కనీసం గ్రాసం కూడా అందించలేని దుస్థితి ఉండేదని, తెలంగాణ ఏర్పాడిన తరువాత అలాంటి పరిస్థితి నుంచి .. నేడు ఐదారు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యం రాష్ట్రంగా మారిందని అన్నారు. మన రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్‌ నిధి పేరుతో కేంద్రం అమలు చేస్తున్నదని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతిని ఢిల్లీలో మెచ్చుకుంటారు. కానీ, ఇక్కడికి వచ్చి మాత్రం విమర్శలు గుప్పిస్తారని అన్నారు. మోదీ తప్పులను ఎత్తి చూపితే తిడతారా అని నిలదీశారు.

కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపైకి ఈడీలు, ఐటీలు, సీబీఐ లను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ద్వారా తెలంగాణ ఖ్యాతి, గౌరవం వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.కేసీఆర్‌కు తెలంగాణపై ఉన్నంత ప్రేమ.. మోదీకి ఉంటుందా? రాహుల్ గాంధీకి ఉంటుందా ?అని  ప్రశ్నించారు.  సీఎం కేసీఆర్‌ను తిడితే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం అట్టడుగున ఉన్న తెలంగాణను.. దేశానికి ఆదర్శంగా నిలిపాడని అన్నారు. అబద్ధాలు రాజ్యమేలుతాయని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమాధులు తవ్వాలని ఒకరు, భవనాలు కూలగొడతానని ఇంకొకరు అంటారని, మనకు సమాధులు కూలగొట్టే వాళ్లు కావాలా?  లేదా ప్రగతి పునాదులు వేసేవారు కావాలో? ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌ రావు కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios