హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గ్రామం చింతమడకలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు హరీష్ రావు చక్రం తిప్పారు. మరోసారి తాను ట్రబుల్ షూటర్ ను అనే విషయాన్ని నిరూపించుకున్నారు. 

సిద్ధిపేట జిల్లాలోని కేసీఆర్ సొంత ఊరు చింతమడకలో పోటీ చేయడానికి ముగ్గురు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెసు అభ్యర్థులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా రంగంలోకి దిగడానికి ప్రయత్నించారు. అయితే, ముఖ్యమంత్రి ఊళ్లో ప్రజల మధ్య ఐక్యత లేదంటే కాస్తా ఇబ్బందిగా ఉంటుందని భావించిన హరీష్ రావు రంగంలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమయ్యేట్లు చూశారు. 

కాంగ్రెసు అభ్యర్థిని, స్వతంత్ర అభ్యర్థిని ఉపసంహరింపజేసి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికయ్యేలా చూశారు. చింతమడక ఎంపిటీసీ సీటు మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్ఎస్ ఆర్. జ్యోతిని తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇతరులు పోటీ నుంచి విరమించుకోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

హరీష్ రావుకు చెందిన సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 9 మంది ఎంపీటీసిలు ఏకగ్రీవం అయ్యారు. ఎంపిటీసిలను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా సిద్ధిపేట ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలువాలని ఓ సమావేశం ఏర్పాటు చేసి నాయకులకు సూచించారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అందరూ ఏకగ్రీవం అయ్యేలా ఆయన చూసుకున్నారు.