వేడి నీళ్లు: కరోనా వైరస్ మీద పోరుకు చిట్కా చెప్పిన హరీష్ రావు

కరోనా వైరస్ మీద పోరాటానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు చిట్కా చెప్పారు. దేవుడి దయవల్ల సిద్ధిపేట జిల్లాలో ఒక్కటే కరోనా కేసు నమోదైందని ఆయన అన్నారు. రైతులకు ఆయన భరోసా ఇచ్చారు.
Harish Rao explains how to fight against Coronavirus
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలంలోని సిమెగాటం గ్రామాల్లో వరి ధాన్య, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఏం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గింజకు మద్ధతు ధర అందిస్తున్నామని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ప్రతి గింజకు మద్ధతు ధర అందించేలా రాష్ట్రంలో 7 వేల వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. మండుటెండల్ని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించిందని అన్నారు.

రైతు శ్రేయోభిలాషి, రైతుబిడ్డగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, కాబట్టే ఇదంతా జరుగుతున్నదని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో వరి పంట వస్తోందని, ఎక్కడా చూసినా ధాన్యపు రాశులు కనపడుతున్నాయని మంత్రి చెప్పారు. కష్టపడ్డ ప్రతి రైతుకు తగిన ఫలితం దక్కాలని రాష్ట్ర వ్యాప్తంగా 7వేల ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఎక్కడా రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన ముందు జాగ్రత్తలు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. రైతు నష్టపోవద్దు, రైతులకు తగిన మద్ధతు ధర ఇవ్వాలని ప్రతి క్వింటాలుకు 1835/- రూపాయల మద్ధతు ధరను వరి పంటకు ప్రభుత్వం రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. టోకెన్లు లేకుండా రైతులు ధాన్యాన్ని కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకురావొద్దని చెప్పారు. 

వరి పంట కోసిన తర్వాత బాగా ఆరబెట్టి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలకు తీసుకురావాలని, ప్రతి రేషన్ కార్డు పై సీఏం కేసీఆర్ రూ.1500 రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేశారని, 
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇబ్బందులు ఉండొద్దని అన్నారు. 13 వందల 14 కోట్ల రూపాయలను లబ్ధిదారుల కోసం ప్రతి రేషన్ కార్డుపై 1500 రూపాయలను బ్యాంకుల్లో జమ చేశామని అన్నారు. 

బ్యాంకుల్లో జమ చేసిన 1500 రూపాయల డబ్బులు ఎటుపోవని, అనవసర పుకార్లు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని అన్నారు. అత్యవసరంగా నిత్యావసర సరుకులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి. చేశారు. బ్యాంకుల వద్ద ప్రజలంతా గుమిగూడొద్దని, కరోనా కోసం ఇన్ని రోజులు చేసిన కృషిని వృథా చేయొద్దని అన్నారు. 

అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, మండలాల ఏంపీడీఓలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆకలితో ఉన్న వారు ఉపాధి పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మిన వారం రోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. 

చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తుందని, రైతుకు మేలు జరిగేలా నిర్ణయాన్ని రైతులే చేపట్టాలని అన్నారు. రేపో, మాపో కాళేశ్వరం నీళ్లు తెచ్చి సింగాటం చెరువులు, కుంటలు నింపే శుభఘడియలు దగ్గరికొచ్చాయని అన్నారు. గోదావరి జలాలు వచ్చాక.. సిద్ధిపేట జిల్లా హరిత జిల్లాగా మారుతుందని అన్నారు. 600 మీటర్ల ఎత్తైన ఈ గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలు తేవడం కేవలం సీఏం కేసీఆర్ తోనే సాధ్యమైందని హరీష్ రావు అన్నారు.

హరీష్ రావు చెప్పిన చిట్కా ఇదే....

దేవుని దయవల్ల మన సిద్ధిపేట జిల్లాలో ఒక్కటే కరోనా కేసు నమోదైందని అన్నారు. కరోనాను మందులేదు. ఎవరి ఇంట్లో వారు ఉండటమే కరోనాను అసలైన మందు అని చెప్పారు. వేడి నీళ్ల ఆవిరి, గోరు వెచ్చని నీళ్లు తాగితే.. గొంతు వద్దనే కరోనాను ఆరికట్టవచ్చునని చెప్పారు.  వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడంలో నియోజకవర్గంతో పాటు జిల్లాలోనే మర్కుక్ మండలంఆదర్శ మండలంగా ఫస్ట్ నిలిచిందని అన్నారు. 

కరోనా కట్టడి, లాక్ డౌన్ నేపథ్యంలో మండలంలోనిప్రతి గ్రామంలోని ప్రజలు రోడ్ల మీదకు రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ., అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని, స్థానిక ఎస్ఐ, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ., లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన అన్నారు.

మానవాళి విపత్తు కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు ఆపన్న హస్తం చాచుదామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం వరదరాజ్ పూర్, గజ్వేల్ మండలం సింగాటం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. 
 
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన హన్మకొండ చంద్రారెడ్డి గురువారం ఉదయం వరదరాజ్ పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. 
 
గజ్వేల్ నియోజకవర్గ ఏల్ఐసీ ఏజెంట్స్, సిబ్బంది ఆధ్వర్యంలో రూ.51వేల రూపాయల డీడీని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని గురువారం ఉదయం సింగాటం గ్రామంలో మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios