Asianet News TeluguAsianet News Telugu

కొడంగల్ లో హరీష్ మరో సీక్రెట్ ఆపరేషన్

  • కొడంగల్ లో స్పీడ్ పెంచిన హరీష్
  • రహస్య భేటీలతో హల్ చల్
  • ఆబ్కారీ పోలీసులను కూడా మీటింగ్ కు పిలిచిన టిఆర్ఎస్
  • వివాదంగా మారిన ఆబ్కారీ పోలీసుల స్పీచ్
Harish on covert politcal operation in kodangal to wean away fans from  revanth

కొడంగల్ నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. దానికి కారణం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటినుంచే అధికార టిఆర్ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయన మనుషులు కొడంగల్ ను జల్లెడ పడుతున్నారు. ఒక రౌండ్ పూర్తి చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు తాజాగా మరో రౌండ్ కూడా హరీష్ ఆపరేషన్ చేసినట్లు చెబుతున్నారు. గత రెండు రోజుల క్రితం అంటే గురువారం రాత్రి కొడంగల్ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల గౌడ సామాజిక వర్గం నేతలందరినీ హైదరాబాద్ పిలిపించారు. అత్తాపూర్ లోని పిల్లర్ నెంబర్ 68 వద్ద ఉన్న హోటల్ కింగ్స్ ప్యాలెస్ లో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి సుమారు 170 మంది హాజరయ్యారు. సమావేశంలో మంత్రి హరీష్ రావుతోపాటు పట్నం మహేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. వారితోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలిసింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే ఈ సమావేశానికి మంత్రులు, నాయకులు, గౌడ కులస్తులే కాదు.. ఆబ్కారీ పోలీసులు (ఎక్సైజ్ పోలీసులు) కూడా వచ్చిర్రట. వాళ్లు ఈ సందర్భంగా కొడంగల్ లో మీమీద ఎలాంటి దాడులు చేయం.. మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు... ఇప్పటి నుంచి తనిఖీలు ఉండవు.. మీరు వ్యాపారాలు హాయిగా చేసుకోవచ్చు.. మీకు ఫ్రీ గా లైసెన్స్ లు రెనువల్ చేస్తాం.. అని మీటింగ్ లో గౌడ కులస్తుల ను ఉద్దేశించి మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ సమావేశాలకు ఇలా ఆబ్కారోళ్లు పోవుడేందన్న విమర్శలు కొడంగల్ లో గుప్పుమంటున్నాయి. కొడంగల్ లో గౌడ కులస్తులే కాకుండా మిగతా వర్గాల్లోనూ ఈ గుసగుసలు జోరందుకున్నాయి.

ఇక ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. కొడంగల్ లోని గౌడ సామాజికవర్గం మొత్తం టిఆర్ఎస్ వైపై నిలవాలని కోరారు. ఉప ఎన్నికలు వచ్చినా.. రాకపోయినా గౌడ్స్ మద్దతు టిఆర్ఎస్ కు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన గౌడ్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. ఎందుకంటే ఇదేదో రాష్ట్ర స్థాయి గౌడ కులస్థుల సమావేశం అనుకున్నాం కానీ... కేవలం కొడంగల్ గౌడ్స్ తోనే సమావేశం పెట్టిర్రేందబ్బా అని వారు అవాక్కయ్యారట. అయితే సమావేశం జరుగుతుండగానే.. కొడంగల్ నుంచి వచ్చిన గౌడ్స్ లో కొందరు రేవంత్ మద్దతుదారులు కూడా ఉన్నారు. వారు నాలుగేండ్ల తర్వాత మీకు గౌడ్స్ ఇప్పుడు యాదికి వచ్చిర్రా అని నిలదీసే ప్రయత్నం చేశారట. ఇలా సమావేశంలో కొడంగల్ గౌడ్స్ మాట్లాడుతుండగానే హరీష్ రావు సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలిసింది. మిగతా నేతలు సమావేశాన్ని కొనసాగించారట. రాత్రి 11 గంటల వరకు సమావేశం జరిగిందని చెబుతున్నారు.

ఇంకో విషయమేమంటే అతి త్వరలోనే మరో కులం వారితో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అన్నింటికి మించిన ట్విస్ట్ ఏందంటే ఈ సమావేశానికి వచ్చిన 170 మంది వరకు గౌడ్ కులస్తులందరినీ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సమావేశ మందిరంలోకి పోనిచ్చిర్రట. మీటింగ్ ఫొటోలు, వీడియోలు తీసి పరేషాన్ చేస్తరన్న ఉద్దేశంతోనే అలా చేసిర్రని వారు చెబుతున్నారు. అయితే ఈ సమావేశం వివరాలన్నింటినీ రేవంత్ మద్దతుదారులు రేవంత్ రెడ్డికి వివరించిర్రట. మొత్తానికి ఈ కులాల మీటింగ్ లు షురూ చేయడంతో కొడంగల్ రాజకీయం మరింత రంజుగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios