Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో ‘శభాష్ హరీష్’ అంటున్నారు

తెలంగాణ నీటిపారుదల శాఖ మత్రి హరీష్ రావును పలువురు అభినందిస్తున్నారు. శభాష్ హరీష్ అని కొనియాడుతున్నారు. ఆరేడు దశాబ్దాల కాలంలో ఎవరూ చేయని గొప్ప ప్రయత్నం హరీష్ రావు చేశాడని ప్రశంసిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఇలాంటి విషయాల్లో కూడా స్పందించడం గ్రేట్ అంటున్నారు.

harish is the first politcian to talk of social honor of widows in recent past

తెలంగాణ ప్రభుత్వంలో సిఎం కెసిఆర్ తర్వాత హరీష్ రావుది కీలక స్థానం. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి హరీష్ పార్టీలో, ప్రభుత్వంలో తనదైన పాత్ర పోశిస్తున్నారు. ఒక్క సిద్ధిపేటలోనే కాకుండా రాష్ట్రమంతా హరీష్ పట్ల జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. టిఆర్ఎస్ కార్యకర్తల్లో సైతం హరీష్ మంచి పేరే సంపాదించుకున్నారు.

 

తాజాగా హరీష్ రావు చేసిన ఒక ప్రకటన పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా  ఎల్బీ స్టేడియంలో బాల వికాస ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సభలో హరీష్ రావు మాట్లాడుతూ వితంతువులకు సాంఘిక గౌరవం ఇచ్చేందుకు తనవంతు పాత్ర పోశిస్తానని ప్రకటించారు. ఇకనుంచి సర్కారు చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాలకు వితంతువులతోనే కొబ్బరికాయలు కొట్టిస్తామని చెప్పారు. మూఢ నమ్మకాలను బద్ధలు కొడతామన్నారు. అసెంబ్లీలో వితంతువుల సమస్యలపై చర్చ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రెండో పెళ్లి చేసుకుంటే తప్పులేదని వితంతువులు ఎవరూ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

 

గత ఆరేడు దశాబ్దాల కాలంలో వితంతువుల సమస్యల పట్ల ఇంతగా స్పందించిన వారు లేరనే చెప్పాలి. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వితంతు మహిళలకు సాంఘిక గౌరవం కల్పించేందుకు తెలుగు నేల మీద కానీ, దేశవ్యాప్తంగా కానీ ఎవరూ పెద్దగా సాహసం చేసిన దాఖలాలు లేవు. ఏదో భర్త చనిపోయిన వెంటనే ఇండ్లు ఇప్పించడం, పెన్షన్ ఏర్పాటు చేయడం తర్వాత వారిని గాలికొదిలేయడమే చేశారు.

 

తాజాగా మంత్రి హరీష్ రావు చాలా కీలకమైన నిర్ణయాలను ప్రకటించారు. సర్కారు చేపట్టే శంకుస్థాపన కార్యక్రమాల్లో వితంతువులతోనే కొబ్బరికాయ కొట్టించి ప్రారంభోత్సవం చేస్తామనడం పట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. వితంతువుల పట్ల చిన్నచూపు ఉండకూదని, వారిని లైంగికంగా వేధిస్తే కఠినంగా శిక్షిస్తామని చెప్పడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందంటున్నారు.

 

పూర్వ కాలంలో  సతీసహగమనం అమలులో ఉండేది. భర్త చనిపోగానే భార్యను చితిలో తోసేసి చంపేవారు. తర్వాత ఎందరో మహానుభావులు ఆ దురాచారంపై నిరసన గళం వినిపించడంతో సతీసహగమనం రద్దు చేయబడింది. సతీసహగమనం రద్దు చేయబడినా వితంతువులకు సాంఘిక గౌరవం మాత్రం దక్కలేదు. వారు తెల్ల చీర కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోరాదు. శుభకార్యాల్లో పాల్గొనరాదు. ఇలాంటి అనిచివేత చాలాకాలమే కొనసాగింది. ఇప్పుడిప్పుడే వితంతువులు రెండో పెళ్లి చేసుకోవడం, బయట తిరగడం లాంటివి చేస్తున్నప్పటికీ మెజార్టీ సెక్షన్ ఇంకా సాంఘిక గౌరవం పొందుతున్న దాఖలాలు లేవనే చెప్పాలి. మంత్రి హరీష్ రావు ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాలనే వారితో ప్రారంభించేలా కార్యాచరణ చేపడతామని ప్రకటించడం వారికి ఆనందం కలిగిస్తోంది.

 

కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు లాంటి మహానుభావులు సాంఘిక దురాచారాలపై శక్తివంచన లేకుండా పనిచేశారు. వారి తర్వాత కాలంలో అంతటి స్థాయిలో ఎవరూ పనిచేసిన దాఖలాలు లేవు. తాజాగా హరీష్ రావు మాత్రం వితంతువులను ఊరడించే ప్రకటనలు చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? లేక మాటలకే పరిమితమవుతుందా అన్నది చూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios