పేద గుండెకు హరీష్ పెద్ద భరోసా ఆపదలో ఉన్న పాపను ఆదుకున్న హరీష్ 4లక్షలు సిఎంఆర్ఎఫ్ నుంచి ఇప్పించి వైద్యం చేయించిన మంత్రి 

మంత్రి హరీశ్ రావు మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.క్లిష్టమైన హృద్రోగం తో బాధపడుతున్న చిన్నారి కి అండగా నిలిచి ఆమె ను ప్రాణాపాయం నుంచి బయట పడేశారు. వివరాలివి.

మెదక్ జిల్లా తుఫ్రాన్ కు చెందిన ఏడు సంవత్సరాల సిందె అక్షయ పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధి తో భాధపడుతోంది. గుండె లో నాలుగు గదులు ఉండాల్సి ఉంటే ఆమె మూడు గదులతో జన్మించింది. మంచి ,చెడు రక్తాలను వేరు చేసే వ్యవస్థ కూడా సరిగా లేక పోవడం తో తరచూ ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడేది. నిద్ర లేమి తో బాధ పడేది. పాపకు ఏడాది వయసున్నపుడు ప్రైవేట్ ఆస్పత్రి లో శస్త్ర చికిత్స జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. కడు పేదరికం అనుభవిస్తున్న కుటుంబం అయినా పాప ను మందులతో బతికించుకునేందుకు తండ్రి సిందె చంద్రం తన స్థోమత మేరకు పోరాడారు. మరో సారి శస్త్ర చికిత్స చేస్తే పాప ప్రాణాపాయం నుంచి బయట పడుతుందని హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్య పరీక్ష ల తర్వాత నిర్దారించింది.

ఈ శస్త్ర చికిత్స కు భారీ మొత్తం లో ఖర్చవుతుందని వైద్యులు సూచించడంతో పాప తండ్రి సోషల్ మీడియా లో సీఎం కు లేఖ రాసి తన పాపను ఎలాగైనా కాపాడాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు దృష్టికి ఆయన సన్నిహితులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి బాధిత పాప తండ్రి చంద్రం ను మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసానికి రావాలని సూచించారు. పాప మెడికల్ రిపోర్టులను చూసిన హరీశ్ వైద్యానికి ఎంత ఖర్చయినా భరిస్తామని భరోసా ఇచ్చారు.

అప్పటికే నిలోఫర్ ఆస్పత్రిలో విషమ పరిస్థితి లో ఉన్న అక్షయ ను మంత్రి సూచన మేరకు బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు మూడో వారం నుంచి పాపకు చికిత్స మొదలైంది. పాప వైద్యానికి అవసరమయ్యే నాలుగు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా హరీశ్ రావు మంజూరు చేయించారు. వైద్యులు ఊపిరితిత్తుల వ్యవస్థ ను బాగు పరచడంతో పాటు అక్షయ గుండె రక్త నాళానికి స్టెంట్ వేయడంతో ఆమె పూర్తిగా కోలుకుంది. ఆరేళ్లుగా అక్షయ పడుతున్న అవస్థకు దీంతో తెరపడింది .పూర్తిగా కోలుకున్న చిన్నారిని శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

హరీశ్ సార్ మా పాలిట దేవుడు

తన పాపను కాపాడాలని ఎవరిని వేడుకున్నా ఫలితం లేకపోయిందనీ చివరకు మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా లో తన లేఖకు దేవుడి రూపంలో స్పందించడం జీవితంలో ఎపుడూ మరిచిపోనని అక్షయ తండ్రి చంద్రం అన్నారు. పాప తమకు దక్కకుండా పోతుందేమో అనే ఆందోళనలో ఉండగా మంత్రి స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్యానికయినా ఖర్చు ను ఇప్పించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. తమ లాంటి పేదవారిని అక్కున చేర్చుకుని ఆదరించిన హరీశ్ రావు కు ఎపుడూ రుణపడి ఉంటానన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి