శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. అచ్చం దిశ సంఘటనను పోలి ఉండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జనం రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే శంషాబాద్‌ విమానాశ్రయంలోని రోటరీ టూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

రోటరీ టూ ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కనే ఆనవాళ్లు లేకుండా పూర్తిగా దహనమైన స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడివుంది. శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన అచ్చంగా దిశ ఘటనను గుర్తుకు తెచ్చేలా ఉండడంతో  స్థానికులు కలవరపాటుకు గురయ్యారు. 
డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 35 నుంచి 40  సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం విమానాశ్రయంలోని రోటరీ 2 వద్ద పడి ఉండటాన్ని గమనించిన వాహనదారులు, పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పరిసరాలను పరిశీలించారు. ఆ మహిళపై దుండగులు లైంగికదాడికి పాల్పడి, హత్య చేసి, ఆమెను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.