52 డిగ్రీల ఎండలో 40 కి.మీ కాలినడక ... ఇదీ మా దుస్థితి :  హైదరబాదీ హజ్ యాత్రికులు  

పవిత్ర  హజ్ యాత్రలో హాహాకారాలు మిన్నంటాయి. సౌదీ అరేబియాలో కాస్తున్న మండుటెండలకు పారంలో కోడిపిల్లల్లా తయారయ్యింది యాత్రికుల పరిస్థితి. సాహజం చేసి ఎండలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా హజ్ యాత్రకు వెళ్లిన హైదరాబాదీల పరిస్థితి ఎలా వుందంటే...  

Hajj pilgrims died due to extreme heat in Soudi Arabia AKP

Hajj Yatra : పవిత్రస్థలం మక్కాను సందర్శించేందుకు ముస్లింలు హజ్ యాత్ర చేస్తుంటారు. ఇలా ప్రతిఏటా లక్షలాదిమంది ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కా సందర్శిస్తుంటారు. ఇలా ప్రస్తుతం హజ్ యాత్ర చేస్తున్నవారు పిట్టల్లా రాలిపోతున్నారు. సౌదీలో ఎండలు మండిపోతున్నాయి... అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈ ఎండవేడికి తట్టుకోలేక హజ్ యాత్రికులు ప్రాణాలు వదులుతున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యిమందికి పైగా హజ్ యాత్రికులు ప్రాణాలు వదలగా ఇందులో భారతీయులే 98 మంది వున్నారు. 

ఎండవేడిమి, ఉక్కపోతతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేకపోవడంతోనే హజ్ యాత్రికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నారు. ఇలా  హైదరాబాద్ కు చెందినవారు కూడా ఈ సౌదీ ఎండల్లో మగ్గుతున్నారు. యాత్రికులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని హైదరాబాదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్ కు చెందిన ఎండీ ఫరీద్ హజ్ యాత్రకు వెళ్లాడు. అతడు తాజాగా సౌదీలో పరిస్థితి గురించి, హజ్ యాత్రికుల అవస్థల గురించి తమకు ఫోన్ ద్వారా వివరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కధనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం సౌదీలో హజ్ యాత్రికుల పరిస్థితి దయనీయంగా వున్నట్లు అర్థమవుతోంది. 

ప్రస్తుతం సౌదీ అరేబియాలో విపరీతమైన ఎండలు కాస్తున్నాయని... పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 52 డిగ్రీ సెల్సియస్ వరకు సమోదవుతున్నాయని  ఎండి ఫరీద్ తెలిపాడు. దీనికి తోడు సరైన సౌకర్యాలు లేకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని... ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇలా సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో మండుటెండలోనే  యాత్రికులు ఏకంగా 40 కిలో మీటర్లు నడవాల్సి వచ్చిందని అతడు తెలిపాడు. దీంతో వడదెబ్బకు గురయి అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.  ఇక ఈ ఎండలో నడిచిన అందరి కాళ్లకు బుగ్గలు వచ్చాయని ఫరీద్ తెలిపాడు. 

ఇది ఒక్క ఫరీద్ బాధే కాదు...హజ్ యాత్రకు వెళ్లిన అందరిది. తెలంగాణ నుండి హజ్ యాత్రకు వెళ్లిన చాలామంది రవాణా సదుపాయం లేకపోవడంతో ఎండల బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో 8 నుండి 10 గంటలు ఎదురుచూడాల్సి వస్తోందని అంటున్నారు. ఇలా తిండితిప్పలు లేకుండా ఎండలో మగ్గిపోవడం...దిక్కులేని పరిస్థితుల్లో నడుస్తూ ముందుకు కదులుతుండటమే ప్రమాదాలకు కారణం అవుతోందని యాత్రికులు చెబుతున్నారు. 

అయితే తెలంగాణ నుండి హజ్ యాత్రకు వెళ్ళినవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు.  మొదటిరోజు యాత్రికులు కాస్త ఇబ్బందిపడిన మాట వాస్తమేనని...ఆ తర్వాత అన్ని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా మంచి ఆహారం, వసతి కల్పిస్తున్నామని హజ్ కమిటీ సీఈవో షేక్ లియాఖత్ హుస్సేన్ తెలిపారు.
   

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios