తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హజీపూర్ వరస హత్యల కేసులో నిందితడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

కాగా... విచారణలో పలు విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. మే 8 నుంచి 13 వరకు తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు నిందితుడిని వివిధ కోణాల్లో విచారించారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి మొబైల్‌లో చాలా మంది అమ్మాయిల ఫొటోలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కో ఫొటోను అతడికి చూపిస్తూ వారు ఎవరు.. నీ మొబైల్‌లో ఎందుకున్నాయని ఆరా తీశారు. దీనికి నిందితుడు బదులిస్తూ.. అందమైన అమ్మాయిల ఫొటోలను తీయడం తనకు అలవాటు, అంతే తప్ప వారితో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించినట్లు తెలిసింది. 

దీంతో శ్రావణి హత్యోందంతం వెలుగుచూసిన రెండు మూడు రోజుల ముందు శ్రీనివాస్‌రెడ్డి ఎవరికి కాల్‌ చేశాడో ఆ డేటా ఆధారంగా ఫోటోల్లోని అమ్మాయిలకు, నిందితుడికి, హత్యకేసులకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారించినట్లు సమాచారం. మొబైల్‌లోని ఫోటోల్లో ఉన్న అమ్మాయిల పేర్లను శ్రీనివాస్‌రెడ్డి నుంచి తెలుసుకుంటూ వారి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించినట్టు పోలీసులు తెలిపారు.