నల్గొండ జిల్లా హజీపూర్‌లో తన కామ వాంఛ తీర్చుకోడానికి శ్రీనివాస్ రెడ్డి అనే సీరియల్ కిల్లర్ చిన్నారుల ప్రాణాలను బలితీసున్న విషయం తెలిసిందే. ముగ్గురు చిన్నారులపై ఈ నిందితుడు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆ తర్వాత క్రూరంగా హతమార్చాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతడి పాపం పండి ఆ  నేరాలన్ని  బయటపడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలు, గ్రామస్తులతో పాటు తాజాగా నిందితుడి కుటుంబ సబ్యులు కూడా అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. 

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి మాట్లాడుతూ...ఈ దుర్మార్గుడు తమ  కడుపున పుట్టినందుకు బాధగా వుందన్నారు. తమతో పాటే నివాసముంటున్నా ఏనాడూ అతడిపై అనుమానం రాలేదని తెలిపారు. కర్నూల్ కేసులో జైలుపాలైనా...ఆ తర్వాత అతడి ప్రవర్తన బాగానే వుండేదని తెలిపారు. కానీ ఎవరికీ తెలియకుండా ఇంత దారుణానికి పాల్పడతాడని ఊహించలేదన్నారు. కొడుకుగా తన దృష్టిలో అతడెప్పుడో చచ్చిపోయాడని... అతడిని  ఉరి తీయాలని బాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఇక శ్రీనివాస్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... శ్రావణి మృతదేహం బావిలో వుందని తెలిసినప్పుడు మేమిద్దరం కలిసే వున్నామన్నారు. అతడు చేసిన దారుణాల గురించి బయటపడగానే అతడు తమ బంధువుల తలదాచుకున్నాడని... ఆ విషయాన్ని తానే పోలీసులకు తెలిపానన్నారు. అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్న తన తమ్ముడిని కఠినంగా శిక్షించాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.