రాజీనామా వార్తలపై గుత్తా గుస్సా ఎలా వచ్చాయని ఆశ్చర్యం
రాజీనామా వార్తతో నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి గుస్సాఅవుతున్నాడట. ఆయన రాజీనామా చేస్తాడని, టిఆర్ ఎస్ నల్గొండలోనంద్యాల సృష్టిస్తుందని వార్త తెలంగాణలో హల్ చల్ చేస్తున్నది. ఆయన రాజీనామా చేసి రైతు సమన్వయ సమితి రాష్ట్ర ఛైర్మన్ గా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం ఊపందుకుంది. ఆర్ఎస్ఎస్ ఛైర్మన్ పోస్టుకు కేబినెట్ స్థాయి ర్యాంకు ఉంటుందని చెబుతున్నారు.
అయితే తన సన్నిహితుల వద్ద రాజీనామా విషయంలో గుత్తా గుస్సా గా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇది ఆయన్ను బాగా ఇరుకున పెట్టిందని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గుత్తా చేత రాజీనామా చేయించి ఆ స్థానంలో ఉప ఎన్నికను తీసుకురావాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నయి. తద్వారా ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు అన్నట్లు టిఆర్ఎస్ మంత్రాంగం రచిస్తోందన్న వాదనలు బయటకొచ్చాయి.
ఇదంతా ఇలా ఉంటే... రాజీనామాపై గుత్తా నుంచి ఎలాంటి సమాచారం అందడంలేదు. ఆయన స్పందన కోసం గత రెండు రోజులుగా ఏషియా నెట్ ప్రతినిధి ఫోన్ చేసినా గుత్తా అందుబాటులోకి రాలేదు. ఫోన్ ఎత్తలేదు. రాజీనామా ప్రచారం ఎలా వచ్చిందో అంతుచిక్కడంలేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
ఎందుకు ఇలాంటి ప్రచారం సాగుతుందోనని ఆయన ఆవేదన చెందినట్లు చెబుతున్నారు. ఇది మీడియా సృష్టా లేక ఒక రాజకీయ ఎత్తుగడనా అనేది ఆయనకు అంతుబట్టలేదని సన్నిహితులు చెప్పారు.
