సిద్ధిపేట జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. భూ తగాదాల నేపథ్యంలో కోర్టు నుంచి వస్తున్న వ్యక్తిపై ప్రత్యర్ధి వర్గం కాల్పులు జరిపింది. చందాపూర్ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిద్ధిపేట జిల్లాలో (siddipet district) మరోసారి కాల్పుల (gun firing) కలకలం రేగింది. గజ్వేల్‌లో (gajwel) వంశీ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. గజ్వేల్‌కు సమీపంలోని చెల్లాపూర్‌కు చెందిన ఒగ్గు తిరుపతి, వంశీ (vamsi) అనే ఇద్దరి మధ్యా భూ తగాదాలు (land disputes) వున్నాయి. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం వంశీపై ఒగ్గు తిరుపతి అనుచరులు కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో వంశీ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. చందాపూర్ శివారులో కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
