Asianet News TeluguAsianet News Telugu

Telangana Elections 2023 : ఆ నియోజకవర్గాల్లో కీలకంగా మారనున్న గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులు.. ఎందుకంటే...

గల్ఫ్ కార్మికుల తరఫున కొంతమంది అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు.  

Gulf workers and sugarcane farmers will become key in those 32 constituencies  - bsb
Author
First Published Nov 28, 2023, 10:13 AM IST

నిజామాబాద్ : నిజామాబాదులో ఈసారి గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స అంశాలు ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి చేరుకున్న నేపథ్యంలో ఈసారి నిజామాబాదులో పసుపు బోర్డు అంశం అంతగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తామని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మరీ హామీ ఇచ్చారు. దీంతో రైతులు గంపగుత్తగా ఆయనకు ఓట్లు గుద్ది ఎంపీగా పట్టం కట్టారు. కానీ, ఈ హామీ నెరవేరలేదు. ఈసారి  అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి ఇదే అంశాన్ని ఎత్తుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా పసుపు బోర్డు ప్రకటనను చేయించింది. కానీ, ఇప్పుడు ఈ అంశం పెద్దగా ప్రభావం చూపబోదని విశ్లేషిస్తున్నారు.

ఈసారి ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ 32 నియోజకవర్గాల్లో దాదాపు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. వీరంతా స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గల్ఫ్ కు వలస వెళ్తున్న వారే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఈ కార్మిక కుటుంబాలు అంటున్నాయి. తమ కోసం ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

telangana assembly Elections 2023: టెండర్ ఓటు అంటే ఏమిటీ?

ఈ క్రమంలోనే ఎప్పుడూ లేనట్టుగా గల్ఫ్ కార్మికుల తరఫున కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో కూడా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ధర్మపురి నుంచి బూత్కూరి కాంత, నిర్మల్ నుంచి స్వదేష్ పరికిపండ్ల, వేములవాడ నుంచి గుగ్గిళ్ళ రవి గౌడ్, కోరుట్ల నుంచి చిన్నమనేని శ్రీనివాసరావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.  ఈసారి ఎన్నికల్లో ప్రభావితం చేయాలన్న నేపథ్యంలోనే గల్ఫ్ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. అక్కడి వలస కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ప్రచారం నిర్వహించారు.

గల్ఫ్ జేఏసీ నాయకులు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గల్ఫ్ కాకుండా వేరే దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోందని.. కానీ గల్ఫ్ మృతుల విషయంలో వివక్ష చూపిస్తోందన్న విమర్శలు  ఉన్న సంగతి తెలిసిందే. అందుకే గల్ఫ్ బోర్డు ఏర్పడితే గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల మృతదేహాలను తెప్పించడానికి, అక్కడి కార్మికుల సంక్షేమం కోసం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని కార్మికులు చెబుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో తమకు పక్కా హామీలు ఇచ్చి, తమ సంక్షేమానికి కృషి చేస్తారనుకున్న వారి వైపే గల్ఫ్ కార్మికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని సమాచారం.

వీటితోపాటు నిజాం షుగర్స్ అంశం కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపి, కాంగ్రెస్ లు నిజాం షుగర్స్ యూనిట్స్ ను తాము అధికారంలోకి వస్తే తిరిగి తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చేరుకు రైతులను ఆకట్టుకునేందుకు ఈ రెండు పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి నిజాంబాద్ లోని బోధన్, ఉమ్మడి కరీంనగర్ లోని ముత్యంపేట, ఉమ్మడి మెదక్ లోని మంభోజిపల్లి జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తామని  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బిజెపి అగ్రనేత, ప్రధాని మోడీలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. 

ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల ఓట్లు  కీలకం కానున్నాయి. ఏళ్ల తరబడి చెరుకు పంటను పండిస్తున్నామని, తమ ప్రాంత భూములు చెరుకు పంటకు అనుకూలమైనవని  ఆ ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఈ సీజన్లో ఇక్కడి రైతులు ఎకరాలకు ఎకరాలు చెరుకు పండిస్తారని.. కానీ  నిజాం షుగర్స్ మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios