కొన్ని గంటల్లో పెళ్లనగా.. ఆగిన వరుడి గుండె..
కొద్ది గంటల్లో పెళ్లనగా నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన అదిలాబాద్ లో విషాదం నింపింది. రక్తపోటు పెరగడంతో గురువారం ఉదయం అతను మృతి చెందాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని ఉట్నూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల్లో పెళ్లి జరగనుండగా వరుడు మృతి చెందాడు. ఈ ఘటనతో అదిలాబాద్ జిల్లా ఉట్నూరులో విషాదం అలుముకుంది. పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇల్లు ఒక్కసారిగా ఏడ్పులతో మార్మోగిపోయింది. కొన్ని గంటల్లో పెళ్లి అనగా పెళ్లి కొడుకు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో దిగ్భ్రాంతి నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన రావుల శంకరయ్య చారి, భూలక్ష్మి దంపతులకు సత్యనారాయణ చారి(34) పెద్ద కొడుకు. అతనికి జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఓ యువతీతో పెళ్లి కుదిరించారు. శుక్రవారంనాడు ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి ఏర్పాట్లు వైభవోపేతంగా చేశారు. బుధవారం అర్ధరాత్రివరకు కూడా పెళ్లి పనులు సమన్వయం చేస్తూ.. కుటుంబ సభ్యులు, బంధువులతో వరుడు సంతోషంగా గడిపాడు.
జమ్మికుంటలో కలకలం : రైలు ఇంజిన్ కు వేలాడుతూ మృతదేహం..ఎవరిదంటే..
ఈ క్రమంలోనే ఒక్కసారిగా రక్తపోటు పెరిగి కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో పరిస్థితి విషమించి చేజారిపోయింది. దీంతో ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. సత్యనారాయణ అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చివరి శ్వాస వదిలాడు.
కొడుకు పెళ్లి చేసుకుని కోడలితో ఇంట్లో తిరుగుతుంటే ఆ సంతోషాన్ని చూడాలనుకున్న కన్నవారి కోరిక తీరలేదు. అప్పటివరకు తమతోపాటే ఉన్న కొడుకు ఒక్కసారిగా మాయం అవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. సత్యనారాయణ ఉట్నూరులో స్వర్ణకారుడుగా పనిచేస్తున్నాడు.