పెళ్ళి ముహూర్తం ముంచుకొస్తున్నా రోడ్డుపైనే... ఓ వరుడికి వింత అనుభవం
ఎంతో ఆనందంగా పెళ్ళికి బయలుదేరిన వరుడుకి వింత అనుభవం ఎదురయ్యింది. ఊహించని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని టెన్షన్ పడాల్సి వచ్చింది.

వరంగల్ : పెళ్ళి... జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. దీంతో ప్రతిఒక్కరు ఎంతో వైభవంగా వివాహ వేడుకలు జరుపుకుంటారు. ఇలా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆనందంగా మండపానికి వెళుతున్న ఓ యువకుడికి వింత అనుభవం ఎదురయ్యింది. మూహూర్తం సమయం ముంచుకొస్తున్నా ట్రాఫిక్ లోనే ఇరుక్కుని రోడ్డుపైనే వుండిపోయాడు వరుడు. దీంతో కారు దిగి పెళ్లి బట్టల్లోనే రోడ్డుపై పరుగుతీస్తున్న యువకుడిని చూసి అందరూ ఆశ్యర్యంగా చూసారు.
వివరాల్లోకి వెళితే... వరంగల్ కు చెందిన యువకుడికి తొర్రూరు యువతితో పెళ్లి కుదిరింది. ఇవాళ(గురువారం) వధువు ఇంట పెళ్లి జరగాల్సి వుంది...ఉదయం 10 గంటలకు ముహూర్తం. దీంతో వరంగల్ నుండి తొర్రూరుకు పెద్ద దూరం లేకపోవడంతో వరుడు ఉదయం కారులో బయలుదేరాడు. అయితే ఊహించని విధంగా మార్గమధ్యలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో అతడికి వింత పరిస్థితి ఎదురయ్యింది.
అయితే ఇవాళ ఉదయం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో రాకపోకలకు అడ్డంగా మారిన భారీ వాహనాన్ని రోడ్డుపై నుండి తొలగించేందుకు భారీ క్రేన్లతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలను ఆపారు. దీంతో వరంగల్ నుండి తొర్రూరు వెళుతున్న వరుడి కారు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఓవైపు ముహూర్తానికి సమయం ముంచుకొస్తున్నా వాహనాలు ముందుకు కదలకపోవడంతో అతడిలో కంగారు మొదలయ్యింది.
Read More బాత్రూం చెత్తబుట్టలో బంగారమే బంగారం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో...
సహనం కోల్పోయిన వరుడు కారు దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్లగా రోడ్డు మధ్యలో లారీ కనిపించింది. వెనక్కి వెళ్ళి మరో మార్గంలో వెళదామనుకుంటే అప్పటికే భారీగా వాహనాలు నిలిచాయి. దీంతో ముందుకు, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అతడి బాధను అర్థం చేసుకున్న పోలీసులు తొందరగా ట్యాంకర్ ను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. దీంతో కాస్త ఆలస్యమైనా వరుడు పెళ్లి మండపానికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.