బాజా భజంత్రీలు మోగాల్సిన పెళ్లి ఇంట తీవ్రవిషాదం చోటు చేసుకుంది. పెళ్లికి కొద్ది గంటలుందనగా పెళ్లి కొడుకు వడదెబ్బతో మృతి చెందాడు. 

కొమురం భీమ్ జిల్లా : కొద్ది గంటల్లో పెళ్లి అనగా వరుడు వడదెబ్బతో మృతి చెందడం.. విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా కౌటాల మండలం గుండ్లబోరి గ్రామంలో చోటుచేసుకుంది. బాజాభజంత్రీలు మోగాల్సిన పెళ్లి ఇంట్లో ఒకసారిగా విషాదం ఆవరించింది. కుటుంబ సభ్యులు, బంధువులు దీనికి సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు.. గుండ్ల బోరి గ్రామానికి చెందిన శ్యామ్ రావు - యశోద దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడి పేరు తిరుపతి (32). అతడికి ఇటీవల వివాహాన్ని నిశ్చయించారు.

మంచిర్యాల భీమినికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. బుధవారం వివాహం జరగాల్సి ఉంది. దీనికోసం గుండ్లబోరీలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తిరుపతి పెళ్లి పనుల కోసం తిరిగాడు. దీంతో మంగళవారం నాడు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా వడదెబ్బ తగిలిందని తెలిపారు. అక్కడ చికిత్స అందించి అందించినా ప్రయోజనం లేకపోవడంతో సాయంత్రం మెరుగైన వైద్యం కోసం కాగజ్ నగగర్ కు తరలించారు.

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం..హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి జారిపడి విద్యార్థిని మృతి..

అక్కడ చికిత్స అందిస్తుండగానే మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా తిరుపతి ఆరోగ్యం విషమించింది. దీంతో అక్కడి నుంచి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తిరుపతి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వివరాలు తెలిపారు. కొడుకు మరణ వార్తతో ఆ తల్లిదండ్రుల శోకం మిన్నంటింది. 

నిరుడు వీరి చిన్న కుమారుడు గుండ్ల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతను గుండ్లబోరి గ్రామ సర్పంచ్ గా పనిచేశాడు. ఇప్పుడు పెద్ద కొడుకు ఇలా మృతి చెందడంతో.. వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆసరాగా ఉంటారనుకున్న కొడుకులు ఒక్కొక్కరుగా తమ కళ్ళముందే మృత్యు ఒడికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దేవుడు మమ్మల్ని తీసుకెళ్లినా బాగుండేదంటూ రోధిస్తున్నారు.