తెలంగాణ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 27 శాఖల్లో 80,039 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో పాటు ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లాల వారీగా ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో వాటి వివరాలు కూడా సీఎం వెల్లడించారు.
తెలంగాణ (telangana) నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయ్యింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇంత భారీ సంఖ్యలో ఒకే సారి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించడం ఇదే మొదటి సారి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు చేపట్టినా.. చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవి. గతంలో చేపట్టిన భర్తీలో పోలీసు శాఖలోనే అత్యధిక ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ సారి వివిధ శాఖల్లోనూ పెద్ద మొత్తంలో భర్తీ చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్ (cm kcr) వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే సాధ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యామని గుర్తించి ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు పోరాటాల తరువాత స్వరాష్ట్ర కల సాకారం అయ్యింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత కీలకంగా ఉన్నారు. అయితే రాష్ట్రం వచ్చిన తరువాత అనుకున్నట్టుగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. దీనికి ప్రభుత్వం అనేక కారణాలు చెబుతూ వచ్చింది. టెక్నికల్ ఇష్యూస్, జోనల్ వ్యవస్థ ఇలా పలు కారణాలు చెప్పింది. ఏదీ ఏమైనప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నిలకొంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడింది.
టీఆర్ఎస్ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చే సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి విషయంలో ఎలాంటి కదలిక లేదు. ఈ రెండు విషయాల్లో ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే కోర్టు కేసులు, టెక్నికల్ ఇష్యూస్, జోనల్ వ్యవస్థ ఇబ్బందులు తీరిపోయాక ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్టు బుధవారం అసెంబ్లీలో ప్రకటించింది. మొత్తంగా 91,142 ఖాళీలను గుర్తించామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలిపారు. మిగిలిన 80,039 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.
కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు. ఈ నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఇకపై తెలంగాణలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామకాలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతీ ఏడాది జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతామని తెలిపారు.
మొత్తంగా 27 శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను గమనిస్తే హైదరాబాద్ పరిధిలో 5,268 ఉన్నాయి. అలాగే నిజామాబాద్ లో 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలో 1,769, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,561, కరీంనగర్ పరిధిలో 1,465, నల్లగొండ జిల్లాలో 1,398, కామారెడ్డి జిల్లాలో 1,340, ఖమ్మం జిల్లాలో 1,340, భద్రాద్రి కొత్తగూడెంలో 1,316, నాగర్‌కర్నూల్ లో 1,257, సంగారెడ్డిలో 1,243, మహబూబ్‌నగర్ లో 1,213, ఆదిలాబాద్ లో 1,193, సిద్దిపేటలో 1,178, మహబూబాబాద్ లో 1,172, హనుమకొండలో 1,157, మెదక్ లో 1,149, జగిత్యాలలో 1,063, మంచిర్యాలలో 1,025, యాదాద్రి భువనగిరిలో 1,010, జయశంకర్ భూపాలపల్లి లో 918, నిర్మల్ లో 876, వరంగల్ లో 842, కుమ్రం భీం ఆసీఫాబాద్ జిల్లాలో 825, పెద్దపల్లి జిల్లాలో 800, జనగాంలో 760, నారాయణపేట్ లో 741, వికారాబాద్ లో 738, సూర్యాపేట లో 719, ములుగులో 696, జోగులాంబ గద్వాల లో 662, రాజన్న సిరిసిల్లాలో 601, వనపర్తి లో 556 ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
