ఇటీవల హైదరాబాద్ ఓ యువతి యాక్సిడెంట్ చేస్తే ఆమె ఫ్రెండ్ అరెస్టయిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: నూతనంగా తీసుకువచ్చిన ట్రాఫిక్ చట్టాల కారణంగా ఒకరు యాక్సిడెంట్ చేస్తే మరొకరు అరెస్టవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ ఓ యువతి యాక్సిడెంట్ చేస్తే ఆమె ఫ్రెండ్ అరెస్టయిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
బిహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి కర్రి రామకృష్ణ (61) బాలానగర్ లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే గత నెల ఫిబ్రవరిలో అతడి బైక్ ను మనవడు(13) తీసుకుని బయటకు వెళ్లాడు. స్నేహితున్ని ఎక్కించుకుని రోడ్డుపై వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెనకాలకూర్చున్న బాలుడు ఎగిరి డివైడర్ పై పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు ఇన్నాళ్లు హాస్పిటల్ లో చికిత్సపొందుతూ తాజాగా మరణించాడు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలుడు నడిపిన బైక్ రామకృష్ణ పేరిట వుందని గుర్తించారు. దీంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారకుడిగా పేర్కొంటూ రామకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలా మనవడిపై ప్రేమతో బైక్ ఇచ్చినందుకు తాత శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇలాంటిదే ఓ సంఘటన హైదరాబాద్ మూసాపేటలో జరిగింది. యాక్సిడెంట్ అయి బండి తీసుకున్న వ్యక్తి చనిపోవడంతో స్కూటీ యజమాని జైలుకు వెళ్లారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని స్నేహితురాలికి తన స్కూటీ ఇచ్చాడో స్నేహితుడు. దాన్ని నడుపుతున్న క్రమంలో లారీ గుద్దేయడంతో ఆమె చనిపోయింది. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ రెండవ నిందితుడు కాగా, స్కూటీ ఇచ్చిన స్నేహితుడిని పోలీసులు ఏ1 గా పేర్కొన్నారు.
గత శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని ఆది రేష్మా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్కూటీ యజమాని, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయిన అజయ్‌సింగ్ (23) ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉందని చెబుతూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
