ఫుడ్ పాయిజన్... 30 మంది ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినుల అస్వస్థత
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

రంగారెడ్డి : ఫుడ్ పాయిజన్ తో హాస్టల్ విద్యార్థులు హాస్పిటల్ పాలయిన ఘటన రంగారెడ్డి జిల్లా చోటుచేసుకుంది. మంచాల మండలకేంద్రంలోని బిసి బాలికల వసతి గృహంలో ఉదయం అల్పాహారం తిన్నతర్వాత విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇలా 30మంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో పాటు వివిధ సమస్యలతో బాధపడటంతో అప్రమత్తమైన సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. కలుషిత ఆహారం తినడమే విద్యార్థులు అస్వస్థతకు కారణంగా తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా మంచాల బిసి బాలికల వసతిగృహంలో 3నుండి 10వ తరగతి చదివే 140 మంది విద్యార్థినులు వుంటున్నారు. వీళ్లంతా హాస్టల్ పక్కనే వున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.రోజూ మాదిరిగానే నిన్న(శనివారం) కూడా విద్యార్థినులు ఉదయం అల్పాహారంగా పెట్టిన పులిహోరా తిన్నారు. వెంటనే కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలు చేసుకోగా మిగతావారు స్కూల్ కు వెళ్లారు. వీరిలోనూ చాలామంది వాంతులు, కడుపునొప్పి, తలతిప్పడం వంటి సమస్యలతో బాధపడ్డారు. దీంతో వెంటనే అస్వస్థతకు గురయిన విద్యార్థినులందరినీ దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
Read More దారుణం.. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాలువలో తోసేసిన తల్లి.. ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు
మొత్తం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవగా వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది.దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నం హాస్పిటల్... అక్కడినుండి వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సాయంత్రానికి విద్యార్థులంతా కోలుకున్నట్లు సమాచారం.
పురుగులతో కూడిన పాడయిపోయిన పులిహోరను తమకు పెట్టారని విద్యార్థినులు చెబుతున్నారు. గత్యంతరం లేక ఆ ఆహారం తినడంవల్లే అస్వస్థతకు గురయినట్లు చెబుతున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు.