వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి మరో వివాదంలో చిక్కుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి చేసిన ప్రసంగంలో మరుగుదొడ్లు అన్న పదం సరిగా పలకలేక నవ్విన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ స్పందించారు. 

ఆమ్రపాలితో సోమవారం ఫోన్‌లో మాట్లాడిన ఆయన...రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్‌కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమంలో...అదీ రిపబ్లిక్ డే ప్రసంగంలో కలెక్టర్ పదేపదే నవ్వడంపై సీఎస్ ఆమెకు క్లాస్ తీసుకుని ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. 

రిపబ్లిక్ డే రోజున హన్మకొండలోని పరేడ్‌ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమ్రపాలి ప్రసంగం మధ్యలో ఆమె పదేపదే అకారణంగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్  రిపబ్లిక్ డే ప్రసంగం నవ్వులపాలయ్యిందంటూ చాలా విమర్శలు కూడా రావడంతో సీఎస్ ఆమె‌కు ఫోన్‌ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది.