విభజన సమస్యలపై రేపు గవర్నర్ సమక్షంలో భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రెండున్నరేళ్లు గడిచినా ఇరు రాష్ట్రాల మధ్య పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా పంపకాలు ఇంకా చేపట్టలేదు. దీంతో తెలుగు రాష్ట్రాలు ఈ అంశంపై తరచుగా గొడవలకు దిగుతున్నాయి.

ట్రిబ్యునల్ వద్ద నీటి పంపకాల గొడవ కూడా అలానే ఉంది. ఇక పునర్విభన చట్టంలోని 9, 10 వ షెడ్యూళ్లో పేర్కొన్న సంస్థల విభజన ఇంకా కొలిక్కి రాలేదు.

తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విభజనపై గట్టిగా పోరాడుతుంటే... ఏపీ ప్రభుత్వం తెలంగాణలోని ఉమ్మడి సంస్థల ఆస్తులపై మాట్లాడుతోంది.

దీంతో ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలతో గవర్నర్ చర్చించనున్నారు.

ఏపీ తరఫున యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, కాలువ శ్రీనివాస్ తోపాటు ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ తరఫున హరీశ్ రావు మరికొందరు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గణతంత్ర దినోవత్సవ వేడుక సందర్భంగా తెలుగు సీఎంలు రాజ్ భవన్ కు వచ్చినప్పుడు గవర్నర్ ముందు విభజన ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే.

అప్పుడు హైకోర్టు విభజన పై చొరవతీసుకోవాలని చంద్రబాబుకు గవర్నర్ సూచించారు. అయితే హైకోర్టు మాత్రమేకాకుండా అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చంద్రబాబు కోరారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గవర్నర్ విభజన సమస్యను ఓ కొలిక్కితీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.