నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు మహిళా మంత్రులు లేరు..: గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు కష్టపడాలి అని అన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు కష్టపడాలి అని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా తాను వెనక్కి తగనని చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై అధ్యక్షతన మహిళా సమ్మేళనం నిర్వహించారు. మహిళా రిజిర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సమ్మేళనంలో వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి కృషి చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా తెలిపారు. తాను ఒకప్పుడు బీజేపీ నాయకురాలినని.. ఇప్పుడు గవర్నర్‌ను అని అన్నారు. రాజకీయాలపై ఇష్టంతోనే వైద్య వృత్తికి దూరంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ అని అన్నారు.
తాను తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినప్పుడు రాష్ట్రంలో మహిళా మంత్రులు లేరని చెప్పారు. తర్వాత మహిళా మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి ఉందని అన్నారు. మహిళా గవర్నర్ వచ్చిన తర్వాతే.. ఇద్దరు మహిళా మంత్రులు వచ్చారని చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ ఇచ్చినా, ఇవ్వకున్నా తన పని తాను చేసుకుంటూ పోతానని తెలిపారు. తనపై రాళ్లు విసిరితే వాటితో భవంతులు కడతానని చెప్పారు. తనపై దాడి చేసే రక్తం చూస్తే.. ఆ రక్తాన్ని సిరగా మార్చి చరిత్ర రాస్తానని చెప్పారు. అందరూ అందరికి నచ్చాలని లేదని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగనని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఇక, తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. తమిళిసై వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారే అవకాశం లేకపోలేదు.
ఇక, ఈ రోజు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే.. జోన్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని సెంట్రల్ పార్క్‌లో జరగనుంది.