హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  మంగళవారం నాడు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఆరేళ్లలో రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకొందన్నారు.కరోనా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మానవీయ దృక్పథంతో బియ్యం, నగదును అందించిందని ఆమె గుర్తు చేశారు.

లాక్‌డౌన్ తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 52 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. దీని ప్రభావం బడ్జెట్ ప్రణాళికలపై ప్రభావం చూపిందని గవర్నర్ చెప్పారు. ఆదాయం తగ్గినా కూడ సంక్షేమ కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించినట్టుగా గవర్నర్ చెప్పారు.

వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ కోసం తెచ్చిన ధరణి పోర్టల్ నూటికి నూరు శాతం విజయవంతమైందని గవర్నర్ తెలిపారు.సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా  పొలాలకు నీరు అందిస్తున్నట్టుగా ఆమె చెప్పారు.

 పాలమూరు-రంగారెడ్డి సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని  గవర్నర్ తెలిపారు.రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు.రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా గవర్నర్ తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల వయస్సు పరిమితిని పెంచాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా గవర్నర్ తెలిపారు.