తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టీసీ  కార్మికులు రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆర్టీసీ బిల్లును ఆమోదించ‌క‌పోతే రాజ్‌భ‌వ‌న్‌ను ముట్ట‌డిస్తామ‌ని తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్(టీఎంయూ) హెచ్చ‌రించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు ఈరోజు పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ మీదుగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి రాజ్‌భవన్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఆర్టీసీ కార్మికులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌భవన్‌ను ముట్టడించి తీరుతామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. 

అయితే ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చర్చలకు రావాలని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం తాను పుదుచ్చేరిలో ఉండటంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నాయకులతో మాట్లాడనున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు. మరోవైపు గవర్నర్ కోరిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు కూడా చేస్తోంది. దీంతో తాజా పరిణామాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. 

ఇక, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని గవర్నర్‌ తమిళిసై కార్యాలయం స్పష్టం చేసింది. ఇందుకు కొంత సమయం కావాలని పేర్కొంది. అయితే ఈ బిల్లకు సంబంధించి గవర్నర్ 5 అంశాలపై వివరణలు కోరినట్టుగా తెలుస్తోంది. 1958 నుంచి టీఎస్‌ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. 

 విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవని అన్నారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛన్‌ ఇస్తారా? అని ప్రశ్నించారు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారని కూడా అడిగారు. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలు కోరారు.