తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరగడంతోపాటుగా వివాదాలు కూడా పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి హ్యాండ్లింగ్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందని గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని లేపాయి. 

కరోనా కట్టడి చర్యల విషయంలో తెలంగాణ సర్కారు పై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు మరింతగా చర్చనీయాంశమయ్యాయి. కరోనా తీవ్రత విషయంలో ప్రభుత్వం సూచనలను చేసినప్పటికీ... పట్టించుకోలేదంటూ ఆమె తెలంగాణ సర్కారును ఎండగట్టారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహారం తెరాస నేతలకు అస్సలు మింగుడుపడడం లేదు. వారు కారాలు మిర్యాలు నూరుతున్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏకంగా గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేయడం( ఆ తరువాత ఆయన దాన్ని డిలీట్ చేసారు), తెరాస వర్గాలు ఈ విషయంపై ఎంత చిటపటలాడుతున్నారో అర్థమవుతుంది. 

బహిరంగంగా తెరాస నేతలు ఈ విషయమై స్పందించడానికి నిరాకరిస్తున్నప్పటికీ... ఆఫ్ ది రికార్డు మాత్రం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వ పాలనావ్యవహారాల్లో గవర్నర్ జోక్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 

మరొక ముఖ్యుడు స్పందిస్తూ... తెలంగాణ ప్రభుత్వ చర్యలను కోర్టు కూడా మెచ్చుకుందని, కరోనా మరణాల రేటు జాతీయ రేటుకన్నా తక్కువగా ఉందన్న విషయాన్నీ గుర్తించకుండా ప్రభుత్వం పై ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి దిశానిదేశం చేయాల్సిందిపోయి మీడియాకెక్కి రాసిచ్ చేయడమేమిటని వారు వాపోతున్నారు. 

గవర్నర్ వ్యాఖ్యల విషయంలో తెలంగాణ సర్కార్ ఆలోచన క్లియర్ గా ఉంది. గవర్నర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకు పోవాలని భావిస్తున్నారు. వ్యాఖ్యలను పట్టించుకొని మాట్లాడితే.. దానిపై ప్రతిపక్షాలు మాట్లాడి దుమారం మరింత పెద్దదవుతుందని, అదే వదిలేసి పనుల్లో ప్రభుత్వ నిబద్ధతను చూపెడితే వ్యాఖ్యలు వాటంతటవే మరుగున పడిపోతాయని తెరాస భావిస్తోంది.