Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎంపీ పొంగులేటి వ్యవహారం‌పై అధిష్టానానికి ఫిర్యాదు.. రేగా కాంతారావు కీలక వ్యాఖ్యలు..

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు, చేస్తున్న కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Government Whip Rega kantha rao comments on ponguleti srinivasa reddy issue
Author
First Published Jan 11, 2023, 11:05 AM IST

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు, చేస్తున్న కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశాలపై ప్రభుత్వ విప్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పందించారు. 

ఈ నెల 12న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్తగూడెంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రేగా కాంతారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి ఆత్మీయ సమ్మేళం గురించి ప్రశ్నించగా.. పార్టీ అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం పెట్టడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని రేగా కాంతారావు అన్నారు.  అధిష్ఠానాన్ని ధిక్కరించి ఎవరు ఎలా వ్యవహరించినా దాని గురించి పార్టీ చూసుకుంటుందని అన్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ కేటాయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: రాజుల్లా అరాచకాలు.. వడ్డీతో సహా కట్టాల్సిందే : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు


ఇక, మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భగవంతుడి దయతో కాంట్రాక్టర్‌గా నాలుగు రాళ్లు సంపాదించుకున్నానని ఆయన చెప్పారు. డబ్బే మనిషికి ముఖ్యం కాదని.. వంద కోట్లు సంపాదించిన తర్వాత డబ్బుకున్న విలువ పోతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానని ఆయన గుర్తుచేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో ఆనాడు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానని పొంగులేటి తెలిపారు. 

పినపాకలో నీకేం పని అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పినపాకకు తాను ఇప్పుడే రాలేదని.. రాజకీయాల్లోకి వచ్చినరోజే వచ్చానని తెలిపారు.పాయం వెంకటేశ్వర్లుని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. వెంటనే బీఆర్ఎస్‌లో చేరారని పొంగులేటి తెలిపారు. తర్వాత కాలంలో కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మాటమీద బీఆర్ఎస్‌లో చేరామని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత తనకు ఏం జరిగిందో సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌తో వున్న చనువుతో టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అయ్యామని ఆయన పేర్కొన్నారు . 

Follow Us:
Download App:
  • android
  • ios