రాజుల్లా అరాచకాలు.. వడ్డీతో సహా కట్టాల్సిందే : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు
ఎమ్మెల్యేలు రాజుల్లా అరాచకాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖమ్మం మాజీ ఎంపీ , బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని, వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందన్నారు.
రాజకీయంగా తనకు గాడ్‌ఫాదర్‌లు ఎవరూ లేరని, తనకు ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గాడ్‌ఫాదర్‌లని పొంగులేటి అన్నారు.నాలుగేళ్లుగా పదవులు లేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసునని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నానని, పార్టీ మారనని చెప్పట్లేదని ఆయన అన్నారు. మనసులో వున్న ఆవేదన చెబుతున్నానని, గొంతెత్తకుండా ఆనాడు లేనని, ఇప్పుడూ వుండనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పదవులు అవే వస్తాయని, పోయేటప్పుడు పోతాయని పొంగులేటి అన్నారు. పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని.. ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల్లో రాజుల్లా అరాచకాలు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
అధికారం వుందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందన్నారు. గౌరవం ఇచ్చి పుచ్చుకునే బంధం .. రెండు ప్రక్కలా వుండాలని ఆయన అన్నారు. నాలుగేళ్లుగా తండ్రీ కొడుకుల బంధంగా నడించానని, నాకు ఏం ప్రేమ దక్కిందని పొంగులేటి ప్రశ్నించారు. తన వ్యాపార లావాదేవీల గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Also REad: కేటీఆర్‌తో చనువు వల్లే బీఆర్ఎస్‌లో వున్నా.. పార్టీ మారాక గొంతు ఎత్తుతా : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భగవంతుడి దయతో కాంట్రాక్టర్‌గా నాలుగు రాళ్లు సంపాదించుకున్నానని ఆయన చెప్పారు. డబ్బే మనిషికి ముఖ్యం కాదని.. వంద కోట్లు సంపాదించిన తర్వాత డబ్బుకున్న విలువ పోతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరానని ఆయన గుర్తుచేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలతో ఆనాడు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానని పొంగులేటి తెలిపారు.
పినపాకలో నీకేం పని అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పినపాకకు తాను ఇప్పుడే రాలేదని.. రాజకీయాల్లోకి వచ్చినరోజే వచ్చానని తెలిపారు.పాయం వెంకటేశ్వర్లుని గెలిపించుకుని అసెంబ్లీకి పంపించానని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు.. వెంటనే బీఆర్ఎస్‌లో చేరారని పొంగులేటి తెలిపారు. తర్వాత కాలంలో కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మాటమీద బీఆర్ఎస్‌లో చేరామని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత తనకు ఏం జరిగిందో సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌తో వున్న చనువుతో టీఆర్ఎస్‌లోనే కంటిన్యూ అయ్యామని ఆయన పేర్కొన్నారు