ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సంబరాలు చేసుకుంటుండగా ఓ ఉద్యోగి మాత్రం నిరుద్యోగులకు అండగా నిలిచాడు.
జగిత్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులపై వరాలు కురిపించిన విషయం తెలిసిందే. 30శాతం పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయస్సు 61ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు ప్రారంభించగా నిరుద్యోగ యువత మాత్రం ఆందోళన బాట పట్టారు. ఇలా సీఎం నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటుండగా ఓ ఉద్యోగి మాత్రం నిరుద్యోగులకు అండగా నిలిచాడు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను మరింత దూరం చేసే పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానంటూ ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకటించారు. ఈ పెంపు తనకు వద్దంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏనుగు మల్లారెడ్డి ప్రకటించారు.
read more 30శాతం ఫిట్ మెంట్...రిటైర్మెంట్ వయోపరిమితి 61ఏళ్ళు..: ఉద్యోగులకు సీఎం వరాలు
కేవలం తనకు పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేయవద్దని ప్రకటించడమే కాదు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు కూడా దిగారు మల్లారెడ్డి. సీఎం ప్రకటన తర్వాత రెండు రోజులుగా నల్ల బ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.
గతంలో పదవీ విరమణ వయసు 58ఏళ్ళ నుండి 60 సంవత్సరాలకు పెంచడం ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగాలకు దూరమయ్యారని... ఇప్పుడు మరో ఏడాది పెంచడం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతపై మరింత ప్రభావం చూపే అవకాశం వుందన్నారు. వారికి సరయిన సమయంలో అవకాశాలు దక్కకుండా పోతాయని... కొందరు పూర్తిగా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం వుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్రను గుర్తించి వారికి అన్యాయం చేసే నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
