హైదరాబాద్: ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ప్రభుత్వఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించారు.ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ అమలు చేయనున్నట్లు సీఎం అసెంబ్లీలోనే ప్రకటించారు.  పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిల చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

పీఆర్సీపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా 11 పీఆర్సీ కొంత ఆలస్యం అయ్యిందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతోందని తెలిపారు. పీఆర్సీపై సీఎస్ కమిటీ నివేదిక అందించిందని... దీని ప్రకారం 9లక్షల 17వేల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. 

''ప్రభుత్వం ఇప్పటికే 80శాతం ప్రమోషన్లు పూర్తి చేసింది. మిగతా ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీల వెంటనే భర్తీ చేస్తాం. పీఆర్సీ ప్రకారం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పై ఓ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులతో పాటు  వీఆర్ఎ, అంగన్వాడీ, ఆశావర్లకు కూడా పీఆర్సీ వర్తిస్తుంది'' అని సీఎం ప్రకటించారు. 

''ఇక భార్యాభర్తలయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకే చోట పనిచేసేలా అంతర్ జిల్లాల బదిలీలు కూడా చేపడుతున్నాం.  కన్తూర్బా స్కూల్స్ లో మహిళా ఉద్యోగులకు 15రోజుల ప్రసూతి సెలవుల సౌకర్యం కల్పిస్తున్నాం. రిటైర్మెంట్ సమయంలో అందించే గ్రాట్యుటీని 12లక్షల నుండి 16 లక్షలకు పెంచుతున్నాం'' అని సీఎం వెల్లడించారు. 

''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కోసం టీఎన్జీవో పోరాడింది. తెలంగాణ సాధనలో ఉద్యోగులది కీలక పాత్ర. అందువల్లే  తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రెండ్లీ పాత్ర వహిస్తోంది. ఉద్యోగ సంఘాలతో పలుమార్లు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నా. స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా అందించాం'' అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.