గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే..?
Raja Singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు తనను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని బీజేపీ నాయకులు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. దీని వెనుక బీఆర్ఎస్ సర్కారు ఉందని పేర్కొన్నారు.
Goshamahal BJP candidate T Raja Singh: విద్వేషపూరిత ప్రసంగం, కత్తులు వంటి నిషేధిత ఆయుధాలను ప్రదర్శించారనే ఆరోపణలపై గోషామహల్ బీజేపీ అభ్యర్థి టి రాజా సింగ్‌పై రెండు విచారణలకు సంబంధించి మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 16న రాజా సింగ్ ఈ అంశానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. వీడియోలో, నవరాత్రి దాండియా కార్యక్రమాల నిర్వాహకులను ఈ వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని కోరారు. కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను తనిఖీ చేయాలన్నారు. ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని నిర్వాహకులకు చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక నాయకుడు ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు.
నిషేధిత ఆయుధాలు పట్టుకుని..
దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా కత్తులు వంటి నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించిన క్రమంలో రాజాసింగ్ కు షో-కాజ్ నోటీసులు పంపినట్టు పోలీసులు తెలిపారు. తుపాకులు, కత్తులు పెట్టుకుని రాజా సింగ్ పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తుపాకులు వ్యక్తిగత భద్రతా అధికారులకు చెందినవని, కత్తులు చట్టవిరుద్ధమని పోలీసులు పేర్కొన్నారు. నోటీసులపై రాజా సింగ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దసరా రోజున ఆయుధ పూజ చేశారని తెలిపారు. తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రికి కూడా నోటీసులు జారీ చేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారు తీరుపై మండిపడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు పోలీసుల ద్వారా ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. "సీఎం నన్ను వేధించాలని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యేలా చూడాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు నా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను బెదిరిస్తున్నారని" రాజాసింగ్ ఆరోపించారు.
“కేసు బుక్ అయిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రతివాదికి నోటీసులు జారీ చేయబడతాయి. అయితే, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ బుక్ చేసి 16 రోజులు అయ్యింది. ఇప్పుడు వాళ్లు నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలకు గోషామహల్ మినహా అన్ని నియోజకవర్గాల అభ్యర్థులందరినీ బీఆర్‌ఎస్ ప్రకటించిందనీ, ఎంఐఎం నుంచి వారికి ఇంకా అధికారికి ఉత్తర్వులు రాకపోవడంతోనే ఇక్కడ పోటీపై ప్రకటన చేయలేదని విమర్శించారు. గోషామహల్ సీటును బీజేపీ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని వారికి తెలుసుననీ, తమ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.