జైలుకు పంపినా ధర్మం కోసం పోరాడుతా: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
తాను ధర్మం కోసం పోరాటం చేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. తనకు నిన్న మంగళ్ హట్ పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు.
హైదరాబాద్: తాను ఎప్పుడైనా ధర్మం కోసం పోరాటం చేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. తనను తెలంగాణ నుండి బహిష్కరించినా జైలుకు పంపినా కూడా ధర్మం కోసం పనిచేస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఈ నెల 29వ తేదీన ముంబైలో జరిగిన కార్యక్రమంలో తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్టుగా మంగళ్ హట్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు. నిన్న తనకు మంగళ్ హట్ పోలీసులు నోటీసులిచ్చినట్టుగా రాజాసింగ్ చెప్పారు. తెలంగాణలో ఎనిమిదో నిజాం పాలన సాగుతుందని రాజాసింగ్ విమర్శించారు. లవ్ జిహాద్ , గో హత్య , అవినీతిపై తాను మాట్లాడినట్టుగా రాజాసింగ్ వివరించారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని తాను మహరాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యానించినట్టుగా రాజాసింగ్ చెప్పారు. మహరాష్ట్రలో తాను మాట్లాడితే మంగళ్ హట్ పోలీసులు తనకు లేఖలు అందిస్తున్నారని రాజాసింగ్ సెటైర్లు వేశారు. తాను ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నట్టుగా రాజాసింగ్ వివరించారు.
also read:నిబంధనల ఉల్లంఘన: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసుల నోటీసు
ఈ నెల 29వ ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ కు మంగళ్ హట్ పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. 2022 నవంబర్ 9వ తేదీన రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసిన సమయంలో తెలంగాణ హైకోర్టు పలు షరతులు విధించింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. అయితే హైకోర్టు సూచనలను రాజాసింగ్ ఉల్లంఘించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దరిమిలా రాజాసింగ్ కు మంగళ్ హట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ కు పోలీసులు సూచించారు. పోలీసుల నోటీసులకు రాజాసింగ్ సమాధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.