సస్పెన్షన్ ఎత్తివేత: బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజా సింగ్
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.
హైదరాబాద్: సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత బీజేపీ కార్యాలయానికి ఆదివారంనాడు మధ్యాహ్నం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లారు. 2022 ఆగస్టు 23న రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. ఇవాళ ఉదయం రాజాసింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా బీజేపీ కార్యాలయానికి ఇవాళ రాజాసింగ్ వచ్చారు. సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో రాజాసింగ్ కు బీజేపీ చోటు కల్పించింది. బీజేపీ తొలి జాబితాలో రాజాసింగ్ పేరును ప్రకటించడానికి కొద్ది సేపటి ముందే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఆ పార్టీ.
ఇవాళ మధ్యాహ్నం రాజాసింగ్ తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజాసింగ్ కు స్వాగతం పలికారు. రాజాసింగ్ ను కిషన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుండి రాజాసింగ్ బీజేపీ అభ్యర్ధిగా వరుసగా విజయం సాధించారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మూడోసారి ఈ స్థానం నుండి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించనున్నట్టుగా రాజాసింగ్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున విజయం సాధించిన అభ్యర్ధి రాజాసింగ్ ఒక్కరే. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ఇద్దరు విజయం సాధించారు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు విజయం సాధించిన విషయం తెలిసిందే.
also read:రాజాసింగ్ కు ఊరట: సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత రాజాసింగ్ పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వాన్ని కోరింది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరింది. అయితే ఇవాళ బీజేపీ క్రమశిక్షణ సంఘం రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది.