అందరి ఆశీర్వాదంతోనే తిరిగి పార్టీలోకి వచ్చా: బండిసంజయ్ తో రాజాసింగ్ భేటీ
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ను కలిశారు.
కరీంనగర్: అందరి ఆశీర్వాదంతో తాను తిరిగి పార్టీలోకి వచ్చినట్టుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారంనాడు కరీంనగర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.14 నెలల పాటు బీజేపీకి దూరంగా ఉన్నానని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు.బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజన్ సర్కార్ తోనే డబుల్ డెవలప్ మెంట్ సాధ్యమని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ క్రమశిక్షణ సంఘం ఈ నెల 22న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. 2022 ఆగస్టు 23న రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ విధించింది. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించింది బీజేపీ నాయకత్వం.
గత ఏడాది ఆగస్టు మాసంలో మునావర్ ఫరూఖీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. దీంతో సోషల్ మీడియా రాజాసింగ్ ఓ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆందోళనలు నిర్వహించింది. ఈ వీడియోపై పోలీసులు రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో విషయమై రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ విధించింది.ఈ సస్పెన్షన్ పై బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ సమాధానం పంపారు.
also read:రాజాసింగ్ కు ఊరట: సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలోనే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు. అయితే నిన్న రాజాసింగ్ పై సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేసింది. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో రాజాసింగ్ కు చోటు దక్కింది. గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి రాజాసింగ్ మరోసారి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఏడాది తర్వాత రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది బీజేపీ. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని తెలంగాణకు చెందిన పార్టీ నేతలు పలువురు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
ఈ దఫా తనకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వకపోతే తాను పోటీకి దూరంగా ఉంటానని రాాజాసింగ్ గతంలో ప్రకటించారు. అయితే రాజాసింగ్ కు బీజేపీ టిక్కెట్టు కేటాయించింది. మూడో దఫా బీజేపీ అభ్యర్ధిగా గోషామహల్ నుండి రాజాసింగ్ పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్ కూడ బీజేపీ టిక్కెట్టును ఆశించారు. కానీ రాజాసింగ్ కే బీజేపీ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది.