గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రయాణిస్తున్న వాహనం టైర్ నడిరోడ్డుపై ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.  సీఎం కేసీఆర్‌కు, హోంమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం లేదనంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైర్ .. దూల్‌పేట్ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఊడిపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ క్షేమంగా బయటపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనం కండీషన్ సరిగా లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం తనకు అదే కారును కేటాయిస్తోందని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. వేగంగా వెళ్లి వుంటే పెను ప్రమాదం జరిగి వుండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని.. ఇకనైనా తన వాహనాన్ని వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ కోరారు. సీఎం కేసీఆర్‌కు, హోంమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం లేదనంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.లేనిపక్షంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా రాజాసింగ్ కోరారు. 

ఇటీవల కూడా తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆకస్మాత్తుగా రోడ్డుపై ఆగిపోవడంతో రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్మతులకు గురవుతుందని.. దానిని మార్చాలని కోరారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్ముత్తులకు గురువుతుందని.. చెప్పినా రిపేర్ చేసి తిరిగి మళ్లీ అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఆ వాహనం పలు మార్గమధ్యంలోనే నిలిచిపోతుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. అందులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. 

Also REad: అలా చేయకపోతే.. ఇప్పుడున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసుకోండి: ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ

ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారు. తన భద్రతకు ముప్పు ఉందని.. కొత్త వాహనం ఇవ్వడానికి కేటీఆర్ అనుమతి లేదా అని ప్రశ్నించారు. లేకపోతే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. నాకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోవాలని.. పాత వాహనాన్ని తాను వినియోగించలేనని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు