గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం బీజేపీ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేపీ కార్యకర్తలతో కలిసి సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు.

ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు రాజాసింగ్‌తో పాటు ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. రూ.600 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్‌ నీళ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వాస్తుదోషం పేరుతో సచివాలయం, అసెంబ్లీని కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్.. కనీసం 20 వేల ఇళ్లు కూడా కట్టలేదని ఆరోపించారు.

సచివాలయం, అసెంబ్లీ భవనాల పేరుతో వందల కోట్లు వృథా చేసే బదులు పేద ప్రజలకు వెచ్చించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖైరతాబాద్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.