గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బజరంగ్‌ సింగ్‌ ఇద్దరు యువకులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాతబస్తీ ప్రాంతంలోని లోయర్ ధూల్ పేటలో చోటుచేసుకుంది. బజరంగ్ సింగ్ చేతిలో దాడికి గురైన యువకులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు బజరంగ్ సింగ్ నివాసముండే ధూల్ పేట ప్రాంతంలో బుధ వారం అర్థరాత్రి ఇద్దరు యువకులు గొడవపడుతున్నారు. ఇదే సమయంలో అటువైపుగా వెళుతున్న బజరంగ్ వీరిని సముదాయించడానికి ప్రయత్నించారు. అయితే యువకులిద్దరు మాట వినకపోగా అతడినే దూషించారు. అందరి మధ్య యువకులు తనను దూషించడాన్ని అవమానంగా భావించిన అతడు ఇంట్లో నుంచి ఓ కత్తి తీసుకువచ్చి ఇద్దరిపై దాడి చేశాడు. 

ఈ దాడిలో సందీప్‌ సింగ్‌, రాహుల్‌ యాదవ్‌ లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ గొడవపై అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. వారి పిర్యాదు మేరకు నిందితుడు బజరంగ్ సింగ్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి దాడికి పాల్పడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.