గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ‘‘ హిందుస్తాన్ జిందాబాద్’’ పాట తాము విడుదల చేసిన సాంగ్‌ను చూసి కాపీ కొట్టారంటూ పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది.

వివరాల్లోకి వెళితే.. రాజాసింగ్ శ్రీరామనవమి సందర్భంగా ‘హిందుస్తాన్ జిందాబాద్.. దీల్‌కీ అవాజ్.. హర్ దిల్‌కీ అవాజ్’’ అంటూ దేశభక్తిని ప్రభోదిస్తూ ఓ పాటను స్వయంగా ఆలపించి విడుదల చేశారు. అలాగే ఈ పాటను సైన్యానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాటపై పాకిస్తాన్ సైన్యం స్పందించింది. ఆ సాంగ్ ట్యూన్ పాకిస్తాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాటకు కాపీ అంటూ పేర్కొంది.

ఈ పాటను సహిర్ అలీ బగ్గా రాశారని... ఈ పాటను కాపీ కొట్టినందుకు సంతోషంగా ఉందని, కానీ అందుకు సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలని కదా అంటూ పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు.

దీనికి రాజాసింగ్ పాడిన పాటను కూడా జత చేశారు. దీనిపై పాక్‌లోని స్థానిక మీడియా సెటైర్లు వేసింది. రాజాసింగ్‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ పాటలోని ట్యూన్‌ను కాపీ కొట్టి దానిని ‘‘ హిందుస్తాన్ జిందాబాద్‌’’గా మార్చారని, పైగా దానిని భారత సైన్యానికి అంకితమిచ్చారని పేర్కొంది.