Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఉపాధి కూలీలకు శుభవార్త

150 కోట్లు విడుదల చేసినట్లు చెప్పిన ఆర్బీఐ అధికారులు

Good news to food for work workers in Telangana

ఆర్‌బీఐ, పోస్ట‌ల్ అధికారుల‌తో పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష‌

ఉపాధి కూలీ చెల్లింపులో జాప్యం వ‌ద్దు

ఎట్టి ప‌రిస్థితుల్లో న‌గదు కొర‌త రానివ్వ‌కండి

ఉపాధి కూలీ, ఆస‌రా చెల్లింపుల‌కు తొలి ప్రాధాన్య‌త ఇవ్వండి

నిన్న‌నే 150 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు తెలిపిన ఆర్‌బీఐ అధికారులు

మ‌రో వారం రోజుల్లో 150 కోట్ల న‌గ‌దు ఇచ్చేందుకు హామీ

 

హైదరాబాద్‌ : ఉపాధి కూలీ చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాల‌ని...వీటి చెల్లింపుకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కోరారు. ఉపాధి కూలీ చెల్లింపులో జాప్యంపై బ్యాంకింగ్‌, పోస్ట‌ల్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల‌తో మంత్రి జూప‌ల్లి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. నిరుపేద కూలీల‌కోసం ఉపాధి హామీ ప‌థ‌కం చేప‌డుతున్నామ‌ని...వారికి కూలీ చెల్లింపులో జాప్యం చేయ‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని... న‌గ‌దు కొర‌త కార‌ణంగా పోస్ట‌ల్ చెల్లింపుల్లో తీవ్ర‌ జాప్యం జ‌రుగుతోంద‌ని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి  తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా అడ‌గ‌డం వ‌ల్ల ఉపాధి కూలీల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌న్నారు. అలాగే మూడు నెల‌ల పాటు ఆప‌రేట్ చేయ‌కుండా ఉన్న కూలీల‌ అకౌంట్ల‌ను తొలిగించ‌డం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌ను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాక‌రించ‌డం లాంటి కార‌ణాల‌తో దాదాపు 60 శాతం చెల్లింపుల‌ను పోస్ట‌ల్ ద్వారా చేయాల్సి వ‌స్తుందన్నారు.

ఉపాధి కూలీ చెల్లింపుల‌కోసం ఏప్రిల్, మే నెల‌ల్లో బ్యాంకుల‌కు దాదాపు 360 కోట్లను...పోస్టాఫీసుల‌కు 412 కోట్ల‌ను విడుద‌ల చేసిన‌ట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 350 కోట్ల వ‌ర‌కు బ్యాంకులు చెల్లింపులు జ‌రిపాయ‌ని...అయితే పోస్ట‌ల్ ద్వారా మాత్రం కేవ‌లం 79 కోట్లు మాత్ర‌మే చెల్లించిన‌ట్లు అధికారులు వివ‌రించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు...ఇక‌పై ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జ‌ర‌పాల‌ని పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ పీవీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఆర్‌బీఐ నుండి న‌గ‌దు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో పాటు... వారం రోజులుగా పోస్ట‌ల్ సిబ్బంది స‌మ్మెలో ఉండ‌టం వ‌ల్ల చెల్లింపుల్లో జాప్యం జ‌రిగింద‌ని పోస్టు మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ పీవీఎస్ రెడ్డి వివ‌రించారు. న‌గ‌దు కొర‌త‌ను అధిగ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని...ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్ర‌త్యేకంగా 150 కోట్లను గురువారం విడుద‌ల  చేశామ‌ని... మ‌రో 150 కోట్ల‌ను వారం రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని ఆర్‌బీఐ డిప్యూటీ జ‌న‌ర‌ల్ నాగేశ్వ‌ర్‌రావు తెలిపారు. స‌మావేశంలో ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌,  క‌మిష‌న‌ర్ నీతూ కుమారి, డిప్యూటీ క‌మిష‌న‌ర్ సైదులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios