తెలంగాణ సర్పంచులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో మూడు చోట్ల సర్పంచ్ ల సమ్మేళనాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న జోగుళాంబగద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ - మల్కాజ్ గిరి,  నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచ్ ల సమ్మేళనాన్ని మహబూబ్ నగర్ లో నిర్వహించనున్నారు. అలాగే భద్రాద్రి – కొత్తగూడేం, జనగామ, జయశంకర్ – భూపాలపల్లి, ఖమ్మం, మహబూబబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ ( అర్బన్), యాదాద్రి – భువనగిరి జిల్లాల సర్పంచ్ ల సమ్మేళనం వరంగల్ లో ఈ నెల 27న నిర్వహించనున్నారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల సర్పంచ్ ల సమ్మేళనాన్ని మార్చి 5న నిజామాబాద్ లో నిర్వహించనున్నారు.

ప్రతి జిల్లా నుండి 100 మంది సర్పంచ్ లను ఈ సమ్మేళనానికి ఆహ్వనిస్తున్నారు. వీరికి జిల్లాలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ లతో తమ అనుభవాలను పంచుకొనే విధంగా సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు, ఎల్ఈడీ లైట్ల వినియోగం, నీటి సంరక్షణ, ఉపాధిహామీ లాంటి కార్యక్రమాల్లో తాము ఎలా ముందుకువెళ్లింది వివరించి, ఇతర సర్పంచ్ లను ఆ దిశగా సన్నద్ధం చేసేలా టీసీపార్డ్ సర్పంచ్ ల సమ్మేళనానికి ఏర్పాటు చేస్తోంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యే ఈ సమ్మేళనాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

ఈ నెల 24న టీశాట్ లో టీసిపార్డ్ కార్యక్రమాల ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీశాట్ ఛానెల్ లో తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల ప్రసారాలను ఈ నెల 24న పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ప్రతివారం గంటసేపు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అమలుచేస్తోన్న పథకాలు, ప్రయోజనాలపై కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి.