తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపముఖ్యమంత్రి, విద్యశాఖ మంత్రి కడియం శ్రీహరి శుభవార్త చెప్పారు. పది జిల్లాల ప్రకారం టీచర్ పోస్టుల భర్తీకి కొత్త జీవో ఇస్తున్నామని కడియం ప్రకటించారు. త్వరలో టిఎస్సీపిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామన్నారు. ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలకు లోబడి పది జిల్లాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు తీపి కబురు అందించారు.

కొంతమంది కావాలని ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారని కడియం అసహనం వ్యక్తం చేశారు. పది జిల్లాలకు అయినా, 31 జిల్లాలకు అయినా నోటిఫికేషన్ పై కోర్టుకు వెళ్లడానికి పిటిషన్లు సిద్ధం చేసుకున్నట్లు మాకు సమాచారం ఉందని కడియం బాంబు పేల్చారు. కొలువుల కొట్లాట ఎవరు చేస్తున్నారో..నాయకులెవరో మాకు తెలుసని విమర్శించారు.

వచ్చే ఏడాది ఆగస్టులోపు 1,08,000 పోస్టుల భర్తీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఈ భర్తీపై క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. సిఎం కేసిఆర్ ఇచ్చిన మాట తప్పరు అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఇప్పటికే 29వేల పోస్టులు భర్తీ చేశాం..అనుమానముంటే ఆర్టీఐ కింద తెలుసుకోండి అని సవాల్ విసిరారు.

విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్నారు కడియం. విద్యర్థుల ఆత్మహత్యలను ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాడి గెలవాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ణప్తి చేశారు. ఆత్మహత్యలను ఏ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. వాటిని పార్టీలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు.

ఓయు విద్యార్థి సుసైడ్ లెటర్, అతని చేతిరాతను పోల్చి చూస్తే..నకిలీయో, అసలో తేల్తుందన్నారు. మరి అది ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. సిద్ధాంత విబేధాలున్నవాళ్లంతా కలిసి పనిచేస్తున్నారంటే..వారి వెనుక ప్రజలు లేరని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు భావ దారిద్ర్యంలో ఉన్నాయని విమర్శించారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ కామెంట్స్ చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page